దళితుల పాలిట వరం దళిత బంధు: ఎర్రబెల్లి

వచ్చే మార్చి నుంచి దళిత బంధు
బ్యాంక్ లింకేజ్ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధుల జమ
లబ్ధిదారుల ఎంపిక, అమలు కోసం ప్రత్యేక కమిటీలు
ప్రతిష్ఠాత్మకంగా పథకం అమలు
దళితుల పాలిట వరంగా పథకం రూపకల్పన
జనగామ జిల్లాలో దళిత బంధుని సమీక్షించిన మంత్రిదళితుల పాలిట వరం దళిత బంధు: ఎర్రబెల్లిజనగామ జిల్లా : ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే విధంగా నియోజకవర్గానికి 100 కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని మొదటి విడతగా అమలు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ కలెక్టర్ కార్యాలయంలో జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులతో కలిసి మంత్రి సోమవారం దళిత బంధు కార్యక్రమ రూపకల్పన, అమలుపై సమీక్షించారు.

దళిత బంధు పథకం దేశంలోనే విశిష్టమైన, అరుదైన పథకం అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అనేక నూతన పథకాల్లో దళిత బంధు వినూత్న పథకంగా మంత్రి చెప్పారు. నియోజకవర్గంలో 100 మందికి, రూ.10 లక్షల చొప్పున, బ్యాంక్ లింకేజ్ లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అయ్యే విధంగా సీఎం కెసిఆర్ గారు రూపకల్పన చేశారని చెప్పారు. లబ్ధిదారులు తమ జీవనోపాధికి ఉపయోగపడే ఆర్థిక ఉపాధి కార్యక్రమాలను రూపొందించుకోవాలని, తద్వారా వాళ్లంతా బాగుపడాలనేది సీఎం గారి ఆలోచన అన్నారు. జనగామ జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధు సమన్వయం చేయడానికి అధికారులను నియమించామని చెప్పారు. జనగామ కు ఆర్డీవో మధు మోహన్, స్టేషన్ ఘనపూర్ కు drdo రామ్ రెడ్డి, పాలకుర్తి కి డీపఓ రంగా చారీ ఇంచార్జీ లుగా ఉంటారని తెలిపారు.

అలాగే స్టేషన్ జనగామ నియోజకవర్గంలో 24,209 దళిత ఇండ్లు ఉండగా, 84,530 జనాభా ఉందని, పాలకుర్తి నియోజకవర్గం లో 19,093 ఇండ్లు ఉండగా, 67,825 జనాభా ఉందని, జనగామ నియోజకవర్గం లో 17,516 ఇండ్లు ఉండగా, 62,260 జనాభా ఉందని అన్నారు. ఈ మూడు నియోజక వర్గాల్లో 60,818 ఇండ్లు ఉండగా, 2,14,615 మంది దళిత జనాభా ఉందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రజలంతా సమాన అవకాశాలు ఉండాలని, ఆర్థికంగా అంతా ఎదగాలని, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని సీఎం కెసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో వేసే కమిటీల అధ్వర్యంలో సీఎం గారి ఆశయాలకు అనుగుణంగా అంతా కలిసి కట్టుగా సమన్వయంతో పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు మాట్లాడుతూ, సీఎం కెసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని విజయవంతం చేయాలని అధికారులను కోరారు. పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు.