బీజేపోళ్లను ఇక ఉరికిచ్చుడే : మంత్రి ఎర్రబెల్లి

బీజేపోళ్లను ఇక ఉరికిచ్చుడే : మంత్రి ఎర్రబెల్లిహనుమకొండ జిల్లా : తెలంగాణలో బీజేపీ ప్రజాప్రతినిధులను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని, అందుకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయమై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను స్థానికులు నిలదీశారన్నదే నిదర్శనమని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చీటికి మాటికి సీఎం కేసీఆర్ ను జైళ్ల పెడతామంటున్న బీజేపీ నాయకులు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏం నెరవేర్చిందో తేల్చిచెప్పాలని అన్నారు. అలాంటప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రధాని మోడీని ఎక్కడ పెట్టాలని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. హనుమకొండ ఆర్ అంబ్ బీ గెస్ట్ హౌజ్ లో ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే అరూరి రమేష్, జనగామ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు సంపత్ , ఎమ్మెల్సీ బండా ప్రకాష్ లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కేంద్రం వైఖరిని వారు దుయ్యబట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఏం చేసిందని ప్రగల్భాలు పలికే బీజేపీ నాయకులు కేంద్రం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని అన్నారు. వరద బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చనోళ్లు, పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తారని చెప్పడం సిగ్గుచేటుగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. బాధిత రైతులకు కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలని ఆయన కోరారు. కేసీఆర్, కేటీఆర్ లను విమర్శిస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతరని హెచ్చరించారు. వరంగల్ ప్రజలు మరింత చురుకై బయ్యారం ఉక్కు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనవర్సిటీ, తదితర హామీలను నెరవేర్చని బీజేపీ ప్రజాప్రనిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రి సూచించారు.

టీఆర్ఎస్ అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ గా బీజేపీ : దాస్యం
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్రతో సోషల్ మీడియా వేదికగా కొందరు దొంగలు చేస్తున్న విమర్శలను నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. ఇక నాడు తెలంగాణ ఉద్యమంలో సపోర్ట్ చేయని కిషన్ రెడ్డి, నేడు కేంద్ర మంత్రి అయినా తనకు తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేస్తున్నారని దాస్యం అన్నారు. అయినా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కాకుండా టూరిస్ట్ గా వచ్చిపోతున్నాడే తప్ప, అభివృద్ధికి వేయిరూపాయల నిధులు కూడా తెప్పించలేదని ఎద్దేవా చేశారు.

60 లక్షల గులాబీ సైనికుల్లో ఒకరిగా పనిచేస్తూనే, బంగారు తెలంగాణ సాధనలో కేసీఆర్ అండ్ టీం పనిచేస్తుందని దాస్యం తెలిపారు. ఫిబ్రవరి 1న రైల్వే బడ్జెట్ లో కాజీపేట వ్యాగన్ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే నాడు తెలంగాణ ఉద్యమంలో అడ్డుకున్న పార్టీలో రాష్ట్రంలోనే లేకుండా పోయాయని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. కబడ్దార్ బీజేపీ నాయకుల్లారా టీఆర్ఎస్ అభివృద్ధిపై కుట్రలు చేస్తే మీక్కూడా అదే గతి పడుతుందని దాస్యం హెచ్చరించారు.

ఈ సమావేశంలో భాగంగా నూతనంగా జిల్లాల అధ్యక్షులుగా ఎన్నికైన దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్, సంపత్ రెడ్డి లు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలను ఉద్యమకారులను ముందుకు తీసుకెళ్తూ, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని, బీజేపీ నెరవేర్చని హామీలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రాల అధికారాలను తమ పిడికిలిలో పెట్టుకోవాలని చూస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పే సమరాన్ని ఓరుగల్లు నుంచే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా వారు సూచించారు.