కేంద్రంపై ఇక యుద్ధమే..

కేంద్రంపై ఇక యుద్ధమే..హనుమకొండ జిల్లా : ప్రజల చిరకాల వాంఛగా మిగిలిపోతున్న కోచ్ ఫ్యాక్టరీని సాధించడానికి రాజకీయ పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. ఇందుకు ఐక్యపోరాటానికి సిద్ధం కావాలని ఆయన కోరారు. గురువారం కాజీపేట ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్, వర్తక సంఘం ఆధ్వర్యంలో రైల్వే సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందే ఈ ప్రాంత ప్రజల మనోభావాలు కేంద్ర ప్రభుత్వానికి అర్థమవయ్యేలా ఉద్యమాలు చేపట్టి, వివిధ పద్దతుల్లో నిరసనలు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవ తీర్మానించింది.

అన్ని వర్గాల ప్రజలు పోరాటంలో భాగస్వాములయ్యేలా చూడాల్సిన బాధ్యతను రాజకీయ పార్టీలు , స్వచ్ఛంధ సంస్థలు తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశానికి రైల్వే జేఏసీ చైర్మన్ దేవులపల్లి రాఘవేందర్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు అప్పారావు, రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ చైర్మన్ కాల్వ శ్రీనివాస్, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, సుందర్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు జక్కుల రవిందర్ యాదవ్, విజయశ్రీ, సంకు నర్సింగ్, ఎలకంటి రాములు, సయ్యద్ రజాలీ, కర్ర యాదవరెడ్డి, మేకల రవి, రాజయ్య పాల్గొన్నారు.

రాజీనామాలకు భయపడం : దాస్యం వినయ్ భాస్కర్
టీఆర్ఎస్ పార్టీ కానీ, దాస్యం వినయ్ భాస్కర్ గానీ రాజీనామాలకు వెనుకంజ వేయమని, కోచ్ ఫ్యాక్టరీ సాధించడమే మా లక్ష్యమని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటకు ఇవ్వకుండా నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచైనా ఈ సారి కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకు ఉద్యమం ఆగదని, ఇక నిరసన పరంపరం వరంగల్ నుంచే ప్రారంభమవుతుందని దాస్యం హెచ్చరించారు.

సీఎం ఢిల్లీలో దీక్షకు దిగాలి : జంగా రాఘవరెడ్డి
చావు నోట్లో తెలంగాణ తెచ్చిన అంటున్న కేసీఆర్ యేడేళ్లు గడుస్తున్నా కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ, పీవోహెచ్ ఫ్యాక్టరీ ఎందుకు తేవడం లేదో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అన్నారు. ఈనెల 31లోపు జంతర్ మంతర్ దగ్గర దీక్షకు దిగితే ఢిల్లీ దిగొచ్చి కాజీపేటకు న్యాయం చేస్తుందన్నారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అనేది చాలా న్యాయ సమ్మతమైనదని జంగా రాఘవరెడ్డి అన్నారు. కాజీపేటను డివిజన్ కేంద్రంగా చేయాలని ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని ఆయన మండిపడ్డారు.

ఉద్యమంతోనే సాధ్యమవుతుంది : ఎం. చుక్కయ్య
వ్యవసాయానికి సంబంధించి మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ఐక్యంగా ఉద్యమం చేపడితేనే కేంద్రం దిగివస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య అన్నారు. అందకు అందరం ఐక్యంగా పోరాడి కోచ్ ఫ్యాక్టరీని సాధించుకోవాలని ఆయన సూచించారు.