వరంగల్ టైమ్స్, చెన్నై : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రముఖ నటుడు అర్జున్ సర్జ నిర్మించిన దేశంలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. కవితకు అర్జున్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ధ్యాన ముద్రలో ఉన్న ఆంజనేయుడికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు నటుడు అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత చెన్నైలో పర్యటిస్తున్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనేందుకు ఆమె చెన్నైకి వెళ్లారు.
ఈ సందర్భంగా అర్జున్ నిర్మించిన హనుమాన్ టెంపుల్ ను ఆమె సందర్శించారు.ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని కవిత అన్నారు. తమిళనాడు ప్రజలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటారని చెప్పారు. తమిళ ప్రజలు తమ సంస్కృతి, భాష, చరిత్ర, వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని ఆమె తెలిపారు.