నిందితుడు రాజు కోసం పోలీసుల వేట

నిందితుడు రాజు కోసం పోలీసుల వేటహైదరాబాద్ : నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్రపై పాశవికంగా లైంగికదాడి చేసి, హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నిందితుడికి మద్యం తాగే అలవాటు ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్స్ దుకాణాల యజమానులను అప్రమత్తం చేశారు. ప్రతీ దుకాణానికి నిందితుడి ఫోటోలు పంపారు. అలాగే కల్లు కాంపౌండ్ లో సిబ్బందిని అప్రమత్తం చేశారు. నగరంలోని కూలీ అడ్డాల వద్ద నిఘాను పెంచారు.

ప్రతీ గల్లీలో కిరాతకుడి కోసం వెతుకుతున్నారు. వేలాది సీసీటీవీల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడు చివరిసారిగా ఉప్పల్ లో కనిపించినట్లు పోలీస్ వర్గాలు తెలిపారు. ఈక్రమంలో ఉప్పల్ నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే అన్ని బస్సుల డ్రైవర్లు, కండర్లను ప్రశ్నిస్తున్నారు. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులపై తనిఖీలు ముమ్మరం చేశారు. రాజు ఫోటో చూపిస్తూ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అదుపులో నిందితుడు రాజు స్నేహితుడు ఉన్నట్లు తెలిసింది. నిందితుడితో కలిసి సదరు వ్యక్తి ఎల్బీనగర్ వరకు వచ్చాడు. ఆ తర్వాత రాజు అక్కడి నుంచి ఒంటరిగా వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఎల్బీనగర్ లో ఓ ఆటో దొంగతనానికి యత్నించాడు. ఆ తర్వాత నిందితుడు నాగోల్ వెళ్లి.. అక్కడ ఓ వైన్స్ లో మద్యం సేవించాడు. అనంతరం అక్కడి నుంచి ఉప్పల్ వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించారు.

ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. మరో వైపు సూర్యాపేట జిల్లా కోదాడలో సరిహద్దు రామాపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిందితుడి కోసం పోలీసులు తనిఖీలు చేపట్టి, రాజు ఫోటోను చూపిస్తూ ఆనవాళ్లను ప్రయాణికులకు వివరించారు. నిందితుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.