సీపీ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం 

సీపీ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం

సీపీ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం warangaltimes, వరంగల్ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం చేశారు. తమకు న్యాయం చేసినందుకు కృతజ్ఞతగా వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు శుక్రవారం సీపీ ఫ్లెక్సీకి పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు మాట్లాడారు. తమకు నర్సంపేట శివారులో రెండెకరాల భూమి ఉండగా, అందులో నుంచి ఇరవై గుంటల భూమిని ఏనుగుల తండాకు చెందిన ఎస్ బీ ఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయక్ భార్యకు, బానోతు సునీల్ నాయక్ కు 2018 లో అమ్మినట్లు తెలిపారు.

* ఇంకొంత భూమి అమ్మాలంటూ బెదిరింపులు
అప్పటి నుంచి ఎవరి హద్దుల్లో వాళ్ళమే ఉంటున్నామన్నారు. అయితే, కొద్ది కాలం నుంచి మరో పది గుంటల భూమిని అమ్మాలని అనిల్ నాయక్, సునీల్ నాయక్ తమను ఒత్తిడి చేస్తున్నారని ఆ రైతు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీవనోపాధిగా ఉన్న భూమిని అమ్మబోమని చెప్పగా, అప్పటి నుంచి తమను అనిల్ నాయక్, సునీల్ నాయక్ మరి కొంత మందితో కలిసి బెదిరించడంతో పాటు, తమ పొలాన్ని ధ్వంసం చేశారని, హద్దు రాళ్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తామే వారిని కులం పేరుతో దూషించామని మాపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు.

* బెదిరించిన వారిపై కేసులు
అయితే వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ కి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు బాధిత రైతులు. దీంతో ఆయన విచారణ జరిపి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారన్నారు. దీంతో 11 మందిపై నర్సంపేట పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. భూమిని నమ్ముకొని, సాగు చేసుకొని బతికే తమకు సీ పీ రంగనాథ్ సార్ న్యాయం చేశారని, అందుకే ఆయన ఫ్లెక్సీకీ పాలతో అభిషేకం చేశామని రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు తెలిపారు. అలాగే, డీసీపీ కరుణాకర్ కు , పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు.