మళ్లీ వస్తా హామీలు నెరవేరుస్తా : కేసీఆర్
-నర్సంపేటలో సమైక్యవాదులకు చెక్ పెట్టండి
-ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుంది
-ధరణిపై కాంగ్రేసోళ్లు సోయిలేని మాటలు మాట్లాడుతున్నరు
-షర్మిల నోట్ల కట్టలకు ప్రజలు బుద్ధి చెప్పాలి
– నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : నర్సంపేట సభ చూసిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అర్థమైందని సీఎం కేసీఆర్ అన్నారు. టూరిస్టుల్లా ఐదేళ్లకోసారి ఎలక్షన్ల టైంలో వచ్చి పోటీల్లో నిలబడే వాళ్లు గెలవాలా ? నిత్యం నర్సంపేట అభివృద్ధి కోసం, ప్రజల మధ్య ఉండే సుదర్శన్ రెడ్డి గెలవాలా ? నర్సంపేట ప్రజలు ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. సోమవారం నర్సంపేట నియోజకవర్గం సర్వాపురంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు అశేష ప్రజానికం హాజరైంది. సభా స్థలి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. సభా ప్రాంగణం చుట్టు ప్రక్కలా కిక్కిరిసిపోయిన జనం హాజరై పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆశీర్వదించారు.ఈ సభలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 యేళ్లు అవుతుంది. అయినా దేశంలో రావాల్సినంత పరిణితి రాలేదన్నారు. ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్స్ ను, సంక్షేమ పథకాలను జనంలో చర్చ పెట్టి నిజానిజాలు తేల్చాలన్నారు. అప్పుడే ప్రజలు గెలుస్తారని అన్నారు. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీలను కూడా చూడాలని, ప్రజల కోసం ఏ పార్టీ ఏం చేస్తుంది అనే విషయాలు గమనించాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రజలు గెలవడమే ప్రజాస్వామ్య పరిణితని, అప్పుడే ప్రజాస్వామ్యంలో పరిణితి అనేది కనిపిస్తుందన్నారు. నాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్, రాష్ట్రంలో కరువుకు కారణం కాంగ్రెస్, తెలంగాణను తాగు, సాగు నీళ్లకు సావగొట్టింది కాంగ్రెస్ అనేది మనం మరిచిపోవద్దని అన్నారు. తెలంగాణ వచ్చే నాడు భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఈ పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మీ కోసం పని చేసిందని అన్నారు.భవిష్యత్తును నిర్ణయించే ఓటును ఆశామాశిగా వేయొద్దని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు.
-పెద్ది పట్టుబట్టిండు..పాఖాలకు నీళ్లు తెప్పించిండు : సీఎం కేసీఆర్
గోదావరి నుండి పాఖాలకు నీళ్లు రావడమనేది 60యేళ్ల కల అని, అది పట్టుబట్టి సాధించిన ఘనత పెద్ద సుదర్శన్ రెడ్డికే సాధ్యమని కేసీఆర్ అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించుకుని మంచి పని చేశారని ప్రజలకు సీఎం కేసీఆర్ కితాబు ఇచ్చారు. గతంలో నర్సంపేటలో యాసంగిలో 30-35 వేల ఎకరాలు పండేవని, ఇప్పుడు లక్షా 30 వేల ఎకరాల పంట పండుతోందన్నారు.పెద్ది సుదర్శన్ రెడ్డి కంటే ముందు అనేక మంది ఎమ్మెల్యేలు పనిచేశారు, వాళ్ళెవరూ ప్రజలను పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషితో చివరి ఆయకట్టు వరకు నీరందుతోందని సీఎం తెలిపారు. కృష్ణ, గోదావరి నదులు ఉన్నా నాడు మంచి నీళ్ల కోసం ఎందుకు ఇబ్బంది పడ్డాం? మిషన్ భగీరథ ద్వారా 5 ఏళ్లలో నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగం అన్నాం. ఇచ్చిన మాట ప్రకారం తాగు నీరు ఇచ్చామన్నారు. ప్రతీ గిరిజన తండా,ప్రతీ గూడేనికి నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎన్నికలు రాగానే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక్కడికి ప్రచారానికి వస్తారు,గంగా నది ఉండే యూపీలో మంచి నీళ్లు లేవని అన్నారు. పట్టుదలతో మన ఆడబిడ్డలు ఇబ్బందులు పడిద్దని మనసులో ఉంటే చాలు వారు బాధపడకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి కొరత లేకుండా చేసింది. గతంలో కరెంట్ లేక ఎంతో ఇబ్బంది పడేవాళ్లమని అన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదని, మన ఒక్క తెలంగాణలో మాత్రమే ఉందన్నారు.
– ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా వస్తాయి : సీఎం కేసీఆర్
నేను కాపొన్నే..రైతుల బాధలు నాకు తెలుసని సీఎం కేసీఆర్ అన్నారు.వ్యవసాయం, రైతులు బాగుండాలని శపథం తీసుకున్నామన్నారు. రైతుబంధు భూమండలం మీద ఎక్కడా లేదన్నారు. రైతు బంధును పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలంగాణ ప్రజలందరికి తెలుసని అన్నారు.రైతులకు 24 గంటలు కరెంట్, రైతు బంధు, రైతు భీమా ఇస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటలను రాష్ట్రవ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలను పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. రైతుల అప్పులు పోవాలని, బాధలు పోవాలని ఇవన్నీ చేస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ నేతలు రైతు బంధు దుబారా అంటున్నారు.రాహుల్ గాంధీకి వ్యవసాయం తెలుసా, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం అని అనడం విడ్డూరంగా ఉందన్నారు కేసీఆర్. ధరణి వల్ల రైతుల భూములపై వాళ్లకే అధికారం కల్పించామన్నారు.ధరణి వల్ల రైతులకు అనేక సమస్యలు తొలగిపోయాయని అన్నారు. రైతులు ప్రమాదవశాత్తు చనిపోయినా రైతు భీమా రూ.5లక్షలు ఇస్తున్నామన్నారు.ధాన్యం కొన్న డబ్బులు కూడా నేరుగా రైతు బ్యాంక్ ఖాతాల్లో వేస్తున్నామన్నారు.ధరణి తీసేస్తే డబ్బులు ఎలా వస్తాయని కేసీఆర్ రైతులను ఆలోచింపచేశారు. రైతు బంధు ఉండాలంటే సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతు బంధును రూ.10 వేలనుంచి రూ.16 వేలకు పెంచుతామన్నారు.
– కాంగ్రెస్ నీతులు చెప్పడం సిగ్గుచేటు: సీఎం కేసీఆర్
24 గంటల కరెంట్ అవసరం లేదని 3 గంటల కరెంట్ చాలని పదేపదే చెబుతున్న కాంగ్రెస్ నాయకులు, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఒక్క హామీని నెరవేర్చలేదని కేసీఆర్ మండిపడ్డారు.గతంలో కర్ణాటకలో 12 గంటల కరెంట్ ఇచ్చేది. ఇప్పుడు దాన్ని 5 గంటలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3గంటల కరెంట్ ఇస్తామంటున్నారు. పైగా రైతుల దగ్గర 10 హెచ్ పీ మోటరు ఉంటే చాలన్నారు.ఒకప్పుడు ట్రాన్స్ ఫార్మర్ కాలితే ఎంత భాద పడేవాళ్లం అని గుర్తు చేశారు. ఇప్పుడు రూ. 30 లక్షలు పెట్టి 10 హెచ్ పీ మోటర్లు రైతులు కొనాల్నా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు 24గంటల కరెంటు ఉండాలన్న సుదర్శన్ రెడ్డి గెలవాలా, కాంగ్రెస్ గెలవాలా అని కేసీఆర్ ప్రజలను ఆలోచించుకోమన్నారు.
– టూరిస్టులకు బుద్ధి చెప్పండి : సీఎం కేసీఆర్
నర్సంపేట నియోజకవర్గాన్ని బాగుచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపిస్తారా, టూరిస్టుల్లాగా వచ్చే వాళ్లు కావాలా ? అని సీఎం కేసీఆర్ నర్సంపేట ప్రజలను ప్రశ్నించారు. నర్సంపేటకు పెద్ది సుదర్శన్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే మెడికల్ కాలేజ్ వచ్చేదా ? అని కేసీఆర్ ప్రశ్నించారు. నర్సంపేటలో గతంలో కొట్లాటలు, హత్యలు జరిగేవి, ఇప్పుడు ప్రశాంతంగా ఉందని అన్నారు.టూరిస్టుల్లా ఎవరో టైంకి వచ్చి అది చేస్తాం, ఇది చేస్తాం అంటే నర్సంపేట ప్రజలు ఊరుకోవద్దన్నారు. సమైక్యవాదులు, వాళ్ల అనుచరులు ఇక్కడ నిరసన తెలిపారు. నిరసన తెలిపారని వైఎస్ షర్మిల పగబట్టిందట, డబ్బు కట్టలు పంపిస్తదట .. మరి నర్సంపేటలో వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా? నర్సంపేట ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
– సంపద పెంచి పేదలకు పెంచుతున్నాం : సీఎం కేసీఆర్
తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయంలో 18వ ర్యాంకులో ఉన్నాం. ఇప్పుడు తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉన్నామని కేసీఆర్ అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ గా ఉన్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారింది.జిల్లాకు ఒక మెడికల్ ఇచ్చాం.వచ్చే ఏడాది నుంచి 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేయనున్నామని కేసీఆర్ తెలిపారు.
-భారీ మెజార్టీతో పెద్దిని గెలిపించుకోండి : సీఎం కేసీఆర్
నర్సంపేటకు ఓ ప్రత్యేకత ఉందన్నారు కేసీఆర్. తెలంగాణలో డెవలప్మెంట్స్ కొనసాగాలంటే, మళ్లీ పెడదారిన పట్టద్దంటే, పేదల సంక్షేమం ఆగవద్దంటే బీఆర్ఎస్ రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.సుదర్శన్ రెడ్డి స్థానంలో మరో ఎమ్మెల్యే ఉంటే నర్సంపేటకు మెడికలు కాలేజీ వచ్చేదా? గోదావరి నీళ్లు వచ్చినా, కాళేశ్వరం నీళ్లతో 270 చెరువులను నింపుకుంటున్నామని అన్నారు. సుదర్శన్ రెడ్డిని మీరు గతంలో గెలిపించుకుని మంచి పని చేశారని ఆరు నూరైనా పోయినసారికంటే ఎక్కువ సీట్లతో మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే సుదర్శన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తేనే లాభం జరుగుతుందన్నారు.
-గెలిచాక మళ్లీ వస్తా..పనులన్నీ చేసి పెడతా : సీఎం కేసీఆర్
గతంలో ఈ ప్రాంతమంతా కొట్లాటలు, కల్లోలాలు ఉండే, పదేళ్ల నుంచి నర్సంపేట ప్రశాంతంగా ఉందన్నారు. సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో పేదల కోసం మంచి పనులు జరుగుతున్నయాని కేసీఆర్ అన్నారు.మీ మంచి కోసం సుదర్శన్ రెడ్డి కోరిన కోరికలన్నీఇబ్బందికరం ఏమీ కాదని అన్నారు. పాకాల కాలువలు, రంగయ్యచెరువు కాలువలను బాగు చేయాలని సుదర్శన్ రెడ్డి కోరారని అన్నారు. అదే విధంగా నర్సంపేట చుట్టూ రింగ్ రోడ్డు కావాలంటున్నడు తప్పకుండా చేద్దాం అని కేసీఆర్ తెలిపారు. మీ తరపున మీ అందరి మంచి కోసం కోరాడు. సుదర్శన్ రెడ్డిని గెలిపిస్తే ఎన్నికల తర్వాత నర్సంపేటకు వచ్చి ఒక రోజంతా ప్రజల మధ్యనే ఉండి, నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేసిపెడతానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, నియోజకవర్గంలో సమైక్య పార్టీల నాయకులిద్దరూ ఒక్కటై తనను ఎదుర్కోవడానికి వక్రమార్గాలు ఎంచుకుంటున్నారని అన్నారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ తోనే తన ప్రయాణం కొనసాగిస్తున్నానని, తనకు ఎలాంటి ఆస్తి, పాస్థులు లేవని పెద్ది సుదర్శన్ అన్నారు. తన బలం నియోజకవర్గ ప్రజలే అని అన్నారు. నిజాయితీగా, ఒక ప్రజాప్రతినిధిగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు సేవకునిలా పని చేస్తున్నానని అన్నారు. మరొకసారి తనను గెలిపించుకుని, అభివృద్ధిని కొనసాగించాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు.