దేశంలో 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్
వరంగల్ టైమ్స్, న్యూ ఢిల్లీ : నిర్దేశిత గడువు లోగా ఆధార్ కార్డుతో లింక్ చేయని కారణంగా భారత దేశ వ్యాప్తంగా 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్ అయ్యాయి. అనుసంధానానికి ఇచ్చిన గడువు ఈ యేడాది జూన్ 30 తో ముగియడంతో ఈ కార్డులు డీయాక్టివ్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 70.24 కోట్ల పాన్ కార్డు హోల్డర్లు ఉండగా, అందులో 57.25 కోట్ల మంది ఆధార్ తో తమ పాన్ ను అనుసంధానం చేసుకున్నారని సీబీడీటీ పేర్కొంది. 12 కోట్ల పాన్ కార్డుదారులు ఆధార్ తో అనుసంధానం చేయకపోగా, అందులో 11.5కోట్ల కార్డులు డీయాక్టివ్ అయినట్లు వెల్లడించింది.
డీయాక్టివ్ అయిన కార్డులను పునరుద్ధరించడానికి సీబీడీటీ అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం కూ.1000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే 2023 జూన్ 30 గడువును మిస్ అయ్యి ఉన్నారో , వారు పెనాల్టీ చెల్లించి తమ పాన్ కార్డును తిరిగి పునరుద్ధరించుకోవచ్చన్నారు. ఐతే పాన్ కార్డును పునరుద్ధరించడానికి 30 రోజుల సమయం పడుతుందన్నారు. ఈ లోగా నిరుపయోగంగా మారిన కారణంగా పాన్ కార్డును లావాదేవీలకు వినియోగించలేరని సూచించింది. దీనికి సంబంధించి ఈ యేడాది మార్చి 28న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. రూ. 1000 పెనాల్టీ చెల్లించి ఆధార్ అధికారులకు ఆ విషయం వెల్లడిస్తే 30 రోజుల తర్వాత పాన్ కార్డును పునరుద్ధరించుకోవచ్చని పేర్కొంది.