టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
వరంగల్ టైమ్స్, అమరావతి : మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీతో చేరుకున్న కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కన్నా లక్ష్మీనారాయణది ప్రత్యేక స్థానమని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అన్నారు. విద్యార్థి దశ నుంచే కన్నా రాజకీయాల్లో ఉన్నారని, మంత్రిగా మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను చూశానని గుర్తు చేశారు.
పదేళ్లపాటు ముగ్గురు సీఎంల వద్ద కన్నా పనిచేశారని, కన్నాను ఓడించడం తనకు కూడా సాధ్యం కాలేదని చంద్రబాబు నాయుడు కన్నా లక్ష్మీనారాయణను పొగిడారు. టీడీపీలో కన్నా చేరడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. సిద్ధాంతపరంగా పనిచేయడంలో కన్నా లక్ష్మీనారాయణ ఒక గొప్ప నాయకుడని చంద్రబాబు నాయుడు కొనియాడారు.