ఢిల్లీ చేరిన ఏపీ బీజేపీ పంచాయితీ
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముసలం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తర్వాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై అసంతృప్తి నేతలు ఒక్కసారిగా తమ గళం వినిపించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసేందుకు కాషాయ నేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లారు. దాదాపు 30 మంది ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ఇంఛార్జ్ మురళీధరన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడిగా సోము వీర్రాజు తమకు వద్దంటూ ఇంఛార్జ్ వద్ద మొరపెట్టుకున్నారు.
నూతన అధ్యక్షుడు కావాలని పట్టుబట్టారు. రాష్ట్రంలో సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఆరు జిల్లాల అధ్యక్షులను తొలగించారని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు. అయితే ఢిల్లీకి వచ్చిన ఏపీ బీజేపీ నేతలకు మురళీధరన్ క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలపై రచ్చకెక్కొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఇంత మంది ఒకేసారి ఢిల్లీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో వారు ఖంగుతిన్నారు. ఇక ఢిల్లీలో దిగిన 30 మంది ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులతో 20 నిమిషాల పాటు మాట్లాడి పంపించేశారు. తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు కలవాలని వారికి సూచించారు. ఇకపై రాష్ట్ర పరిస్థితులను పరిష్కరించేందుకు ప్రతి నెల సమయం ఇస్తానని మురళీధరన్ తమకు హామీ ఇచ్చారని స్థానిక నేతలు చెబుతున్నారు.