యాదాద్రిలో కూడా బ్రేక్ మరియు ఆన్లైన్ దర్శనాలు 

యాదాద్రిలో కూడా బ్రేక్ మరియు ఆన్లైన్ దర్శనాలు

వరంగల్ టైమ్స్, యాదాద్రి : యాదాద్రిలో కూడా తిరుమలలో మాదిరిగా బ్రేక్ దర్శనాలు, ఆన్లైన్ దర్శనాలు అమలు చేస్తామని ఆలయ ఈవో గీత తెలిపారు. సీఎం కేసీఆర్ మార్చి 28న ఉదయం 11.55 ని.లకు యాదాద్రి ప్రధాన ఆలయాన్ని పున:ప్రారంభిస్తారని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పిస్తామని చెప్పారు. యాదాద్రి కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. కొండ మీద యాగశాల ప్రాంగణంలోని పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపి, దేవాలయం తరపున నడిపే బస్సుల్లో కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు. ప్రతీ భక్తుడికి క్యూఆర్ కోడ్ ను ఇస్తామని, రద్దీకి అనుగుణంగా దేవాలయ బస్సులను నడుపుతామని తెలిపారు. భక్తులు క్యూ కాంప్లెక్స్ నుంచే స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.

ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా యాదాద్రిలో చేపట్టిన ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి సమీక్షించారు. పార్కింగ్, నీటి వసతి, విద్యుత్తు సరఫరా, వీవీఐపీ విడిది నిమిత్తం కేటాయించిన గదులు తదితర అంశాలపై శుక్రవారం యాదాద్రి వీవీఐపీ అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా కొండపైకి సీఎం వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. ప్రెసిడెన్షియల్ సూట్ లో సీఎం కేసీఆర్, విల్లాల్లో మంత్రులు, మున్నూరు కాపు సత్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వసతి కల్పించనున్నారు. సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీవో భూపాల్ రెడ్డి, వైటీడీఏ ఎస్ ఈ వసంతనాయక్, ఈఈ వెంకటేశ్వర్ రెడ్డి, విద్యుత్తు, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.