మోడీ వ్యాఖ్యలపై కేయూలో ఉద్యమ సెగలు

మోడీ వ్యాఖ్యలపై కేయూలో ఉద్యమ సెగలువరంగల్ టైమ్స్,హనుమకొండ జిల్లా: రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, విద్యార్థి, ఉద్యమ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు కేయూ టీఆర్ఎస్వీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్వీ విద్యార్ధి ఉద్యమ నాయకులు మళ్లీ కదం తొక్కారు. రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన దిష్టి బొమ్మను ఊరేగింపుగా తీసుకువచ్చారు. కేయూ మొదటి గేటు వద్ద మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ వైఖరిని ఎండగట్టారు.

తెలంగాణ రాష్ట్రంపై మోడీ ఎందుకు విషం కక్కుతున్నాడో అర్థంకావడం లేదని టీఆర్ఎస్వీ నాయకులు, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే సంక్షేమంలో తెలంగాణ ముందున్నందుకా ?, గుజరాత్ రాష్ట్రం కంటే తెలంగాణ ముందున్నందుకా ? అని మోడీని ప్రశ్నించారు. వేరుపడ్డం..బాగుపడ్డం అని తెలంగాణ ప్రజలు భావిస్తుంటే.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇవ్వకుండా రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేకనే ప్రధాని అక్కసు వెళ్లగక్కుతున్నాడని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ అయితే చూస్తూ ఊరుకునే తత్వం తెలంగాణ ప్రజలది కాదు, మళ్లీ తిరగబడతారని హెచ్చరించారు. మోడీ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని, మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు డా.పాలమకుల కొమురయ్య, మాచర్ల శరత్ చంద్ర, హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్స్ డా. అరూరి రంజిత్ కుమార్, గండ్రకోట రాకేష్ యాదవ్ , లంక రాజగోపాల్, కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, పి.నాగరాజు, పి.రఘు, కె.సుమన్, జి.వీరు, వీరగాని ప్రణయ్, పి.అనిల్, నవీన్, జి.రవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.