వరంగల్ టైమ్స్, రంగారెడ్డి జిల్లా : దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని కించపరిచేలా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశ్వాసం నింపాల్సిన చోట ప్రధాని మోడీ విద్వేషం నింపి రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు. తెలంగాణపై ముందు నుంచే మోడీకి పగ ఉందని అన్నారు. ఇబ్రహీంపట్నంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఇబ్రహీంపట్నం నుంచి అనాజ్ పూర్ వరకు రహదారి విస్తరణ పనులకు, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు, ప్రభుత్వాసుపత్రిలో భవన నిర్మాణానికి, మినీ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఆసరా పెన్షన్లు రానివారికి ఏప్రిల్ నుంచి అందచేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఇబ్రహీంపట్నం చెరువు సుందరీకరణ బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అనంతరం రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలా పనికిమాలిన మాటలు మాట్లాడిన ప్రధాని మరొకరు లేరని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులకు ఇష్టం లేకపోయినా నల్ల చట్టాలు తెచ్చి రద్దు చేశారని గుర్తు చేశారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వలేదు. 8 యేండ్లలో తెలంగాణకు ప్రధాని చేసింది శూన్యమని మండిపడ్డారు. కర్ణాటకలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. దేశంలో మోడీ రాజ్యాంగం అమలవుతోందని ఎద్దేవా చేశారు.