ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంవరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి లోపలికి వచ్చేలోపే గౌతమ్ రెడ్డి కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు. వారం రోజుల పాటు దుబాయ్ ఎక్స్ పోలో పాల్గొన్నగౌతమ్ రెడ్డి, రెండ్రోజుల క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇటీవలే కొవిడ్ బారినపడిన గౌతమ్ రెడ్డి త్వరగానే కోలుకున్నారు. పోస్టు కొవిడ్ పరిణామాలే గుండెపోటుకు కారణమై ఉండొచ్చని ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు అనుమానిస్తున్నారు.

మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. ఇతను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇతను నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి వీరి సొంత గ్రామం, ఈ గ్రామం ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది. ఇతను వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు. ఇతని వయస్సు 49 సంవత్సరాలు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 1994-1997లో మాంచెస్టర్ యుకె లో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ విశ్వవిద్యాలయం (UMIST)నుండి ఎంఎస్సీ (M.Sc)పట్టాను పొందారు.