మేకపాటి మృతిపై పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి

మేకపాటి మృతిపై పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతివరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఏపీ ప్రజాప్రతినిధులతో పాటు తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం జగన్ దంపతులిద్దరు మేకపాటి ఇంటికి వెళ్లి, ఆయన పార్థీవ దేహానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. మేకపాటి కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని సీఎం జగన్ హత్తుకుని ఓదార్చారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేకపాటి గౌతమ్ రెడ్డికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి, ఓదార్చారు. గౌతమ్ రెడ్డి మరణవార్త బాధించిందని అన్నారు. చిన్నతనంలోనే గొప్పపేరు తెచ్చుకుని, అందరినీ వదిలి వెళ్లడం బాధాకరమని అన్నారు. మంత్రిగా చురుగ్గా పనిచేస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. గౌతంరెడ్డి చిన్నవయసులో దూరం కావడం బాధాకరమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఆయనలేని లోటు పూడ్చలేనిదని అన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకితమై పనిచేశారని బొత్స గుర్తు చేశారు.

మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని గౌతమ్ రెడ్డి ఇంటికి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం వెళ్లారు. గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి కేటీఆర్ నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గౌతమ్ రెడ్డితో తనకు 12 యేళ్లుగా పరిచయం ఉందన్నారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న నాయకుడు గౌతమ్ రెడ్డి అని పేర్కొన్నారు. కుటుంబసభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు.మేకపాటి మృతిపై పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతిమేకపాటి మృతిపట్ల తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.డగౌతమ్ రెడ్డి మరణం తనను కలిచివేసిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేతను కోల్పోయామని తెలిపారు. చిన్న వయసులోనే గౌతమ్ రెడ్డి మరణించడం బాధాకరమని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.

మేకపాటి మృతిపై పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి

ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి కన్నుమూశారనే విషయం నమ్మశక్యం కాలేదని ఆయన అన్నారు. మంచి సేవలు అందించాలని రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు.