భువనగిరిలో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం
వరంగల్ టైమ్స్,రాయగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. సీఎం కేసీఆర్ తొలుత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ రూ.105 కోట్లతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్స్, వీవీఐపీ కాటేజీలను సీఎం ప్రారంభించారు.అక్కడి నుంచి బయలుదేరి భువనగిరిలో నిర్మించిన కలెక్టరేట్ భవనాల సముదాయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ సముదాయం ప్రారంభానికి వచ్చిన సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలతో ఆయన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు.సర్పంచ్ నుంచి మంత్రుల వరకు అందరం మరింత కష్టపడి పనిచేద్దామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలవాలని సూచించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల నుంచి మన పథకాలు, పాలనను పరిశీలించేందుకు వస్తున్నారని, ఆ కీర్తి ప్రతిష్టలు మరింత పెరగాలని ఆయన కోరారు. అయితే సీఎం పర్యటనలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిన్న జనగామ పర్యటనలోనూ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎంపీ వెంకట్ రెడ్డికి ప్రాధాన్యమిచ్చారు. ప్రొటోకాల్ అయినప్పటికీ అధికార పార్టీ నేతలతో కలిసిపోయి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.