వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాదు సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో మూడంకెల స్కోరు సాధించి విమర్శకుల నోటికి తాళం వేశాడు. లాంగ్ ఫార్మట్ లో సెంచరీ కోసం చాలా రోజులుగా వేచి చేస్తన్న హిట్ మ్యాన్ ఎట్టకేలకు తన లక్ష్యం చేరుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ బాదాడు.
అంతేకాదు సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ ‘తొలి భారత కెప్టెన్’ గా రికార్డు సాధించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది 9వ సెంచరీ. ఐతే టెస్ట్ కెప్టెన్ గా మాత్రం ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. తనదైన శైలిలో ఆడుతూ 171 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు.
పుజారా, విరాట్ కోహ్లీ,కేఎల్ రాహుల్ సహా స్టార్ ఆటగాళ్లు పెవిలియన్ కు వరుసగా క్యూ కట్టినా రోహిత్ మాత్రం పట్టుదలగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సహచరులంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నా ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొని సెంచరీతో మెరిశాడు. విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసి టీం స్కోరును ముందుకు తీసుకెళ్తున్నాడు. రోహిత్ రాణించడంతో టీం ఇండియా స్కోర్ 200 పరుగులు దాటింది.
రోహిత్ శర్మ ప్రస్తుతం 46వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. రోహిత్ ఖాతాలో 9 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలున్నాయి. వన్డేల్లో అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 241 వన్డేలు ఆడిన రోహిత్ శర్మ 30 సెంచరీలు, 48 అర్ధసెంచరీలతో 9782 పరుగులు చేశాడు. 148 అంతర్జాతీయ టీ20ల్లో 4 సెంచరీలతో 3853 పరుగులు సాధించాడు.