బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన దాస్యం, కడియం

బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన దాస్యం, కడియంహనుమకొండ జిల్లా : మతోన్మాదులకు తెలంగాణలో చోటు లేదని, అభివృద్ధిని ఓర్వలేకనే తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ దాడి చేస్తోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆగ్రహించారు. 317 జీవోకు వ్యతిరేకంగా జనవరి 9న హనుమకొండలో బీజేపీ నిరసన బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ అస్సాం సీఎం, తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను కడియం శ్రీహరి ఖండించారు.

హన్మకొండ ఎక్సైజ్ కాలనీలోని ఆయన నివాసంలో కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కడియంతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , ఎంపీ పసునూరి దయాకర్ , ఎమ్మెల్సీ బండా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశం ద్వారా బీజేపీ నాయకుల మాటలకు కడియం శ్రీహరితో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కొనియాడిన వారే ఇప్పుడు దూషిస్తుండటం సిగ్గుచేటని వారన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక చర్యలకు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని చీఫ్ విప్ దాస్యం హెచ్చరించారు. అంతేకాకుండా బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టుకుని దేశంలో మతోన్మాద పార్టీకి బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయని చీఫ్ విప్ దాస్యం అన్నారు.

బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన దాస్యం, కడియం

ఇక బీజేపీ నాయకులు పగటి వేషగాళ్లలా వ్యవహరిస్తున్నారని కడియం ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులంతా మతోన్మాదులని ఫైర్ అయిన కడియం శ్రీహరి సీఎం కేసీఆర్ ను తెలంగాణ బాహుబలి అని కొనియాడారు. వరంగల్ లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీల్లో గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని కడియం శ్రీహరి ప్రశ్నించారు. మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేని చవటలు బీజేపీ నాయకులని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణకు బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీశారు. ఇక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కడియం శ్రీహరి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను విమర్శించే అర్హత బండి సంజయ్ కు లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాల గడ్డా, టీఆర్ఎస్ గడ్డా ఖబడ్దార్ అంటూ బండిపై కడియం ఫైర్ అయ్యారు. మధ్యప్రదేశ్, అస్సా సీఎంలకు మతి ఉందా అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. అభివృద్ధి సూచీలో మీ రాష్ట్రాలు ఎక్కడున్నాయో తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు.