మాస్కు ధరించకుంటే భారీ జరిమానా తప్పదు : సీపీ

మాస్కు ధరించకుంటే భారీ జరిమానా తప్పదు : సీపీహనుమకొండ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ తప్పని సరిగా మాస్కులను ధరించాలని వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి సూచించారు. లేదంటే జరిమానా కట్టాల్సి వుంటుందని సీపీ హెచ్చరించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని లేదంటే జరిమానా తప్పదని తెలియజేసే రీతిలో రూపొందించబడిన ప్రచార వాల్ పోస్టర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ అదనపు డీసీపీ సాయి చైతన్య, పరిపాలన విభాగం అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ తో కలిసి సీపీ తరుణ్ జోషి మంగళవారం ఆవిష్కరించారు.

కరోన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అధికవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, మత, రాజకీయ మరియు సాంస్కృతిక కార్యాక్రమాలతో పాటు ఇతర సాముహిక సమావేశాలపై నిషేధాన్ని విధించినట్లు సీపీ తెలిపారు. ప్రజా రవాణా నిర్వహణ సంస్థలు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, సంస్థలు, కార్యాలయాల్లో ప్రతీ ఒక్కరు తప్పక మాస్కులను ధరించి, భౌతికదూరాన్ని పాటించాలని ఆయన కోరారు.

తమ ప్రాంగణంలో తరుచుగా శానిటైజేషన్ చేయించడంతో పాటు, ఐ.ఆర్ థర్మామీటర్లు లేదా థర్మా స్కానర్లలతో ప్రవేశ మార్గం వద్ద తప్పక స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రజలు శానిటైజర్ తో చేతులు శుభ్రపర్చుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా విద్యా సంస్థల నిర్వహకులు తమ సంస్థల్లో సిబ్బంది మరియు విద్యార్థులు తప్పని సరిగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించే విధంగా ఆయా విద్యా సంస్థల యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కొవిడ్-19 నిబంధనలను అనుసరించి ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రతీ ఒక్కరూ మాస్కులను ధరించాలని, మాస్కు ధరించకుండా ఎవరైనా రోడ్లపై తిరిగితే విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి సదరు వ్యక్తులకు రూ. 1000 జరిమానా విధించబడుతుందని హెచ్చారించారు.

థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని సీపీ కోరారు. ప్రజలు తమ వంతు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ లో, కూరగాయల మార్కెట్లలో మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. మాస్కులు లేకుండా కోవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుండి 60 సెక్షను 188 ఐపీసి చట్టప్రకారం చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఈ నిబంధనలు ఈ నెల పదవ తేది వరకు కోనసాగతాయని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.