గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదంహైదరాబాద్‌: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్‌ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతులు సంతోష్, మనోహర్‌, భరద్వాజ్‌, పవన్ , రోషన్ లు మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చెందినవారుగా గుర్తించారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో కారులో గచ్చిబౌలి నుంచి గౌలిదొడ్డొవైపు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో విప్రో సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ ను అధిగమించింది. ఈ క్రమంలో అటు నుంచి వచ్చిన టిప్పర్ ..కారును ఢీకొనడంతో రెండు వాహనాలు రోడ్డుపై పల్టీలు కొట్టాయి. కారు ఎగిరిపడటంతో రోడ్డు పక్కనే తాగునీటి కోసం ఏర్పాటు చేసిన షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. కారు నుజ్జునుజ్జవ్వగా, మృతుల శరీరభాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. మృతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మండలం సంగాయిగూడెంకు చెందిన కాట్రగడ్డ సంతోష్ టెక్ మహీంద్రాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగి. చింతా మనోహర్ తూర్పు గోదావరిజిల్లా సఖినేటిపల్లి నివాసి, పవన్ కుమార్ నెల్లూరు జిల్లా వేదాయపాలెం , పప్పు భరద్వాజ్ విజయవాడ అజిత్ సింగ్ నగర్ , నాగిశెట్టి రోషన్ నెల్లూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.

https://fb.watch/2lAvrgxgOw/