స్పోర్ట్స్ డెస్క్ : వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లోనూ టీం ఇండియా ఓటమిపాలైంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుధవారం జరిగిన మొదటి వన్డేలో భారత్ 31 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. నిలదొక్కుకుంటే పరుగులు రాబట్టడం సులువైన పిచ్ పై మెరుగైన ఆరంభం లభించిన అనంతరం రాహుల్ సేన చేతులెత్తేసింది. ఫలితంగా సిరీస్ సౌతాఫ్రికా 1- 0 తో ముందంజ వేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 రన్స్ చేసింది. వాన్ డెర్ డసెన్ ( 96 బంతుల్లో 129 నాటౌట్ ; 9 ఫోర్లు, 4 సిక్సర్లు ), కెప్టెన్ టెంబా బవుమా (110 ; 8 ఫోర్లు ) సెంచరీలతో కదం తొక్కారు.
క్వింటన్ డికాక్ (27), జానెమన్ మలన్ (6), మార్క్స్ 94) పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, వీరిద్దరూ సఫారీ ఇన్నింగ్స్ కు ఇరుసులా నిలబడ్డారు. 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో ఈ జంట నాలుగో వికెట్ కు 204 పరుగులు జోడించడం విశేషం.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీంఇండియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ ( 84 బంతుల్లో 79 ; 10 ఫోర్లు ), తాజాగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( 63 బంతుల్లో 51 ; 3 ఫోర్లు ) అర్ధశతకాలు చేసినా ఫలితం లేకపోయింది. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (12) తో పాటు రిషబ్ పంత్ (16), శ్రేయస్ అయ్యర్ ( 17), వెంకటేశ్ అయ్యర్ (2), అశ్విన్ (7 ) ఎక్కువసేపు నిలువలేకపోయారు.
ఆఖరిలో శార్దూల్ (43 బంతుల్లో 50 నాటౌట్ ; 5 ఫోర్లు, ఒక సిక్సర్ ) మెరుపులు ఓమటి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగ్డీ, షంసీ, ఫెలుక్వాయో తలా రెండు వికెట్లు పడగొట్టారు. డసెన్ కు ‘ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరుగనుంది.2.