భద్రకాళిబండ్ పై 150 ఫీట్ల ఎత్తులో త్రివర్ణపతాకం
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ లోని భద్రకాళి బండ్ పై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసింది. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఈ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జీడబ్ల్యూఎంసీ ప్రావీణ్య, కార్పొరేటర్లు, స్థానికులు, తదితరులు పాల్గొని రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. మహాత్ములకు నివాళులర్పించి, అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.
జీడబ్ల్యూఎంసీ జనరల్ ఫండ్ రూ. 25 లక్షలతో భద్రకాళి బండ్ పై దీన్ని ఏర్పాటు చేశారు. 150 అడుగుల ఎత్తు స్తంభానికి 32 అడుగుల ఎత్తు, 48 అడుగుల వెడల్పుతో ఉన్న జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. చారిత్రాత్మక ప్రసిద్ధి గాంచిన భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతమైన బండ్ పై ఏర్పాటు చేసిన ఈ మువ్వన్నెల జెండా ప్రతీ ఒక్కరిని కనువిందు చేస్తూ, జాతీయభావాన్ని పెంపొందించింది. చుట్టూ భద్రకాళి చెరువు, చెరువులో భద్రకాళి బండ్, భద్రకాళి బండ్ కు రామన్నపేట వైపుగా ఈ జెండా ఆవిష్కరించడం చూపరులను ఎంతగానో కనువిందు చేస్తుంది.
సర్వమత సమ్మేళనంతో పాటు అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ వరంగల్ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఇప్పటికే నగరంలో ఐటీ హబ్, కల్చరల్ హబ్ లు రెడీ అయ్యాయని, ఇంకా కావాల్సిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తో పాటు, ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ ఫోకస్ చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా భద్రకాళి ఆలయం చుట్టుప్రక్కల మాఢవీధుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల నిధులు కేటాయించడం సంతోషించదగిన విషయమని దాస్యం తెలిపారు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధి వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందని అనడానికి నిదర్శనంగా ఈ 150 అడుగుల జాతీయ జెండా నిలుస్తుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు.