వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, కడవెండి ముద్దు బిడ్డ, దొడ్డి కొమరయ్యపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూజాకార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గడీలో సినిమా షూటింగ్ ప్రారంభించారు. వీఆర్ ఇంటర్నేషనల్ ఐఎన్ సీ పతాకంపై మురళి దర్శకత్వంలో వీరారెడ్డి, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి నిర్మాణ సారథ్యంలో దొడ్డి కొమరయ్య సినిమా చిత్రీకరణ జరుగుతుంది.
తెలంగాణ ఉద్యమానికి ముందు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది అమరులైనారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేశారు. వారిలో దొడ్డి కొమరయ్య మొదటివాడు. కడవెండిలో సంఘం మీటింగ్ జరుగుతుండగా, రజాకార్లు జరిపిన కాల్పుల్లో కొమరయ్య అమరుడయ్యారు. ఆయన పోరాటతత్వం, అలాంటి ఎందరో త్యాగాల స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించారు. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
మనకు, మన ముందు తరాల వారికి ఆనాటి పోరాట యోధుల జీవిత చరిత్రలు తెలియాల్సి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన చరిత్ర, మన సంస్కృతి, మన వైతాళికులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు వాటిని బయటకు తీసే పనిని అనేక మంది నిర్వహిస్తున్నారు. అలా దొడ్డి కొమరయ్య చరిత్ర పై సినిమా తీయడం అభినందనీయం. నిర్మాతలకు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాను. ఈ సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సినిమా బృందం తదితరులు పాల్గొన్నారు.