గాంధీజీ జీవిత విశేషాలపై ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం

గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శం : సురభి వాణీ దేవి, ఎమ్మెల్సీ

గాంధీజీ జీవిత విశేషాలపై ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభంహైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు, సిద్ధాంతాలు అందరూ ఆచరించాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త సురభి వాణి దేవి అన్నారు. గాంధీజీ అనుసరించిన, అభిలషించిన సత్యం, అహింస, స్వచ్ఛత, మహిళల అభ్యున్నతి, గ్రామాల్లో స్వయం పాలన లాంటి సిద్ధాంతాలను నేటి తరం తెలుసుకొని ఆచరించాలని ఆమె కోరారు.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాల’లో భాగంగా, మహాత్మా గాంధీ 152 వ జయంతి సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) మహత్మా గాంధీ జీవిత విశేషాలపై శిల్పారామంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఫోటో ఎగ్జబిషన్ ను గురువారం ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

అనంతరం మహాత్మాగాంధీని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. నేటి తరానికి ఆ మహనీయుని జీవితం, ఆయన పాటించిన ఆదర్శాల గురించి తెలియ చేసేందుకు ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేసిన ఆర్ఓబిని ఆమె అభినందించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పిఐబి, ఆర్ఒబి డైరక్టర్ శృతి పాటిల్ మాట్లాడారు. మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకొని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో’భాగంగా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన క్షేత్రస్థాయి విభాగాలు పలు కార్యక్రమాలు, ఛాయాచిత్ర ప్రదర్శనలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శనలో గాంధీ మహాత్మునికి సంబంధించిన స్వాంతంత్య్ర పోరాటంలోని వివిధ కీలక అంశాలను ఏర్పాటుచేశారు.

అంతకు ముందు క్లీన్ ఇండియా కార్యక్రమం పై నెహ్రూ యువ కేంద్రం రూపొందించిన పోస్టర్ ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ప్రచురణల విభాగం ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య ఆర్ఓబి ,పిఐబి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గాంధీజీ జీవితం ప్రధాన ఇతివృత్తంగా మహాత్మునికి ఎంతో ఇష్టమైన ‘వైష్ణవ జనతో’ప్రార్థనా గీతం నేపథ్యంగా రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో గేయ నాటక విభాగం కళాకారులు ప్రదర్శించిన ‘‘గాంధీ మార్గం’’నాటిక సభికులను అమితంగా ఆకట్టుకుంది. గాంధీజీ విశ్వసించిన, ఆచరించిన సిద్ధాంతాలను సంక్షిప్తంగా, అధ్బుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలను పొందారు.