త్వరలో జనగామ పార్టీ ఆఫీస్ ప్రారంభం

త్వరలో జనగామ పార్టీ ఆఫీస్ ప్రారంభంజనగామ జిల్లా : జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం త్వరలోనే ప్రారంభంకానుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగతా జిల్లాల పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్నాయని అన్నారు. జనగామ పార్టీ కార్యాలయాన్ని మంత్రి దయాకర్ రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డా.టి. రాజయ్యతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయా కార్యాలయాలను సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిపిస్తామని మంత్రి తెలిపారు. పార్టీ కార్యాలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాళోజీ, జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలను ఆయన పరిశీలించారు.

కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలిపారు. త్వరలోనే సీఎంతో మాట్లాడి మరో తేదీ తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాలు ప్రారంభమైతే పార్టీ కార్యకలాపాలన్నీ అందులోనే జరుపుకునే వీలు కలుగుతుందన్నారు. పార్టీ శ్రేణులకు కూడా అనుకూలంగా ఉంటుందన్నారు. పార్టీ కార్యాలయాలు సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో నిర్మిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.