బాలల హక్కులను పరిరక్షించాలి : చీఫ్ విప్ దాస్యం

బాలల హక్కులను పరిరక్షించాలి : చీఫ్ విప్ దాస్యంహనుమకొండ జిల్లా : బాలల హక్కులను పరిరక్షించి వారికి సమాజంలో సముచిత స్థానం కల్పించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం సుబేదారిలోని జిల్లా బాల్ రక్షా భవన్ లో బాల్ రక్షక్ వాహనం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం డిసిపిఓ పి.సంతోష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ గురించి చీఫ్ విప్ మాట్లాడారు.

బాలల రక్షణ, సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని, బాలల హక్కులను కాపాడటానికి వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తుందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బాలల సంక్షేమ సమితి, రాష్ట్ర స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేసి బాలల హక్కులకు భంగం కలుగకుండా కృత నిశ్చయంతో పనిచేస్తుందన్నారు.

రాష్ట్ర మంత్రి కేటీఆర్ చొరవతో స్పందించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సంస్థలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాహన సౌకర్యం కల్పించారని తెలిపారు. హనుమకొండ జిల్లాకు యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాహన సౌకర్యం ఏర్పాటు చేయడం పట్ల చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న బాల బాలికల గురించి ఎవరైనా స్పందించి సమాచారం ఇస్తే త్వరితగతిన స్పందించుటకు వాహన సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందని చీఫ్ విప్ పేర్కొన్నారు.

బాలల హక్కులను పరిరక్షించాలి : చీఫ్ విప్ దాస్యం

ఆపదలో ఉన్న బాల బాలికలకు తక్షణ పునరావాసం కల్పించి బాలల స్నేహ పూర్వక సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. గుర్తించబడిన ప్రతీ బాల బాలికలను వెంటనే బాలల సంక్షేమ సమితి ముందు ప్రవేశ పెట్టీ సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు.

బాలల రక్షణ పరిరక్షణ ధ్యేయంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పని చేస్తుందని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో మరిన్ని పునరావాస చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు అంచెల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి బలోపేతం చేశామని ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి కె.మధురిమ అన్నారు.భవిష్యత్ కార్యాచరణతో మరిన్ని సేవలు అందించుటకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఆపదలో ఉన్న బాల బాలికల తక్షణ పునరావాసం కోసం 1098 కు కాల్ చేయాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్ కోరారు. వారికి పునరావాస చర్యలు అందించుటకు బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ మరియు సమన్వయ శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పి.సుధాకర్, పి.హైమావతి, ఎస్.రాజేంద్ర ప్రసాద్, ఎన్సిఎల్పి డైరెక్టర్ బుర్ర అశోక్ గౌడ్, ప్రొటెక్షన్ అధికారులు ఎస్.ప్రవీణ్ కుమార్, ఎ.సతీష్ కుమార్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ఎం.డి ఇక్బాల్ పాషా, రాగి కృష్ణ మూర్తి, సఖి అడ్మిన్ పి.హైమావతి, బాలల పరిరక్షణ అధికారులు ఎ.మాధవి, ఎం.శ్రీనివాసులు, చైతన్య, జి.సునీత, పి.విజయ్ కుమార్, టి.సీత, సునీల్ , బెజ్జంకి ప్రభాకర్, జ్ఞానేశ్వరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.