త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు..

త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు..హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం దళితబంధు పథకం అమలుపై జిల్లాల కలెక్టర్లతో కరీంనగర్ కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

దళితుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు పథకం సత్ఫలితాలతో దళితులు అభివృద్ధిబాటలో పయనిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈక్రమంలో ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం దళిత బంధు పథకాన్ని తెలంగాణవ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయించారని తెలిపారు.

నియోజకవర్గానికి 100 మంది ఎంపిక..
రాష్ట్రవ్యాప్తంగా 118 నియోజకవర్గాల్లో మొదటిదశలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి దళితబంధు పథకం చేస్తామన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు సమావేశాలు పెట్టుకుని ఫిబ్రవరి 5 లోగా అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి అందించాలని సూచించారు. మార్చి 7లోగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ పథకం అమలుకు నేడు రూ.100 కోట్లు విడుదలయ్యాయనీ, మరో రెండు, మూడురోజుల్లో రూ.12 వందల కోట్లు విడుదల చేసి అన్ని జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.