గిరిడి జిల్లాలో మావోల విధ్వంసం

గిరిడి జిల్లాలో మావోల విధ్వంసంగిరిడి జిల్లా : జార్ఖండ్ లోని గిరిడి జిల్లాలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి 2 -2.30 గంటల సమయంలో గిరిడి జిల్లాలోని డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జిని పేల్చేశారు. అంతటితో ఆగని నక్సల్స్ ఒక మొబైల్ టవర్ ను పేల్చేసి, మరో టవర్ కు నిప్పుపెట్టారు. అగ్రనేత ప్రశాంత్ బోస్ అరెస్ట్ కు నిరసనగా మావోయిస్టులు జనవరి 27 వరకు ‘రెసిస్టెన్స్ వీక్ ‘ గా పాటిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజే వరుస విధ్వంసాలకు పాల్పడ్డారు.

మోటారు సైకిల్ పై వచ్చిన ఇద్దరు మావోయిస్టులు మొదట ఖుఖ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎయిర్ టెల్ టవర్ కు నిప్పుపెట్టారని పోలీసులు తెలిపారు. మధ్యరాత్రి 1 గంటల ప్రాంతంలో జైనుల యాత్రాస్థలమైన మధుబన్లో ఐడియా టవర్ ను పేల్చేశారని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జిని పేల్చేశారని వెల్లడించారు. ఈఘటనల అనంతరం మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ మరింత ముమ్మరం చేసినట్లు డుమ్రి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ తెలిపారు.