వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సమానత్వ స్ఫూర్తిని లోకానికి చాటిన జగద్గురు శ్రీ రామానుజాచార్యుల బోధనలు అందరికీ ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వైష్ణవ దీక్షకు వర్ణాంతరం లేదని, భగవంతుని ఆరాధనకు ప్రతీ ఒక్కరూ అర్హులేనని రామానుజాచార్యులు స్పష్టం చేశారని గుర్తు చేశఆరు. హైదరాబాద్ ముచ్చింతల్ లో జరుగుతున్న సమతా మూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ వేడుకలకు గురువారం ఏపీ గవర్నర్ హాజరయ్యారు. ఫిబ్రవరి 2 న ప్రారంభమైన ఈ వేడుకలు ఫిబ్రవరి 14 వరకు జరగనుండగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంధ విశ్వాసాలను అంతమొందించిన సమతా మూర్తి విగ్రహం తెలుగునాట ఏర్పాటు కావటం శుభపరిణామన్నారు మానవీయ విశ్వభూషణ్. రామానుజార్యుల బోధనలు విశ్వానికి మార్గ నిర్దేశకత్వం వహిస్తున్నాయని, లోక కళ్యాణార్ధం అంతా సమానమే అన్ని సిద్దాంతాన్ని ఆయన ప్రపంచానికి చాటారన్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలు అద్బుతంగా ఉన్నాయన్నారు.
తన పాదస్పర్శతో భూమిని పవిత్రం చేసి ఒక సహస్రాబ్ది గడిచినా, గొప్ప గురువుగా, తత్వవేత్తగా, విశిష్ట అద్వైత వేదాంత ప్రతిపాదకుడిగా రామానుజాచార్యులు తన వారసత్వాన్ని కొనసాగించగలుగుతున్నారని గవర్నర్ పేర్కొన్నారు. భక్తి అనేది కేవలం ముక్తికి సాధనం కాదని, అన్ని ఆధ్యాత్మిక ప్రయత్నాల లక్ష్యమని శ్రీ రామానుజులు తన శిష్యులకు బోధించారన్నారు. ఆయన నిర్దేశించిన మతపరమైన ఆచారాలు, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఇప్పటికీ తమిళనాడులోని శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనుసరించబడుతున్నాయన్నారు. దేశం చుట్టూ సముద్రాలు ఎలా ఉన్నాయో, అలాగే భక్తి తత్వం కూడా అంతటా వ్యాపించి ఉందని, పరమాత్మ శ్రీమన్నారాయణుడు కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు అన్ని ప్రదేశాలలో అందరి హృదయాలలో, జీవాత్మలలో ఉన్నాడని గవర్నర్ పేర్కొన్నారు.
వారణాసిలోని దివ్య కాశీ భవ్య కాశీ, హైదరాబాద్ లోని దివ్య సాకేతం వంటి కట్టడాలు భారతదేశ ఆధ్యాత్మిక పటుత్వాన్ని వెల్లడిస్తాయన్నారు. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సముదాయం, అనితర సాధ్యమైన శ్రీ రామానుజుల విగ్రహం త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామీజీ యొక్క కలల ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకున్నాయని, ఆయన అలుపెరగని కృషి, భక్తి, అంకితభావం వల్లే ఇది సాధ్యమైందన్నారు. చిన్న జీయర్ స్వామీజీ వేద పండితునిగా, తత్వవేత్తగా, ఆధ్యాత్మిక గురువుగా మానవాళికి నిస్వార్థ సేవను అందిస్తున్నారని గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. ‘శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం’ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించటం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.