మేడారం రాజకీయాలపై..మండిపడ్డ మంత్రులు

మేడారం రాజకీయాలపై..మండిపడ్డ మంత్రులువరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: వనదేవతల సన్నిధిలోనూ బీజేపీ నేతలు రాజకీయాలు మాట్లాడటంపై రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ లు మండిపడ్డారు. మేడారం మహాజాతర సందర్భంగా తాము ఏనాడూ రాజకీయాలు మాట్లాడలేదని వారు స్పష్టం చేశారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ బండి సంజయ్ మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

గిరిజన జాతరకు హాజరుకాకుండా సీఎం కేసీఆర్ గిరిజన పండుగను అవహేళన చేశారంటూ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం మేడారం గద్దెల వద్ద ఉన్న మీడియా సెంటర్ లో మంత్రులు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతర ఏర్పాట్లు చేసి, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

మేడారం జాతరకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకురాకుండా, చుట్టపు చూపుగా దర్శనం కోసం వచ్చి రాజకీయాలు చేస్తారా అని మంత్రులు ధ్వజమెత్తారు. బీజేపీ నాయకుల వైఖరి కారణంగా తాము కూడా రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్ కుంభమేళాకు కేంద్రం రూ.325 కోట్లు కేటాయించింది. మరి మేడారం జాతరకు కేవలం రూ.రెండున్నర కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది ఆదివాసీలను అవమానించడం కాదా అని మంత్రులు దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రశ్నించారు. తెలంగాణ కుంభమేళా అయిన మేడారం జాతర ఏం పాపం చేసింది అని నిలదీశారు. ఇంతటి గొప్ప జాతరను జాతీయ పండుగగా ఎందుకు ప్రకటించడం లేదని అడిగారు.

విభజన హామీల్లో చెప్పినట్లు తెలంగాణకు ఇప్పటివరకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. మా గిరిజన విద్యార్థులు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ అన్నా, తెలంగాణ ప్రజలు అన్నా మీకు లెక్కలేదు. ఇంత నిర్లక్ష్యం, వివక్ష చూపిస్తారా అని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.