వనప్రవేశంతో ముగిసిన మేడారం మహాజాతర

వనప్రవేశంతో ముగిసిన మేడారం మహాజాతరవరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర ముగిసింది. భక్తుల నుంచి పూజలందుకున్న గిరిజన దేవతలు శనివారం సాయంత్రం వనప్రవేశం చేశారు. వన ప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర ముగిసింది. సంప్రదాయం ప్రకారం పూజలు చేసిన అనంతరం అమ్మవార్లకు పూజారులు వీడ్కోలు పలికారు. సమ్మక్క చిలుకల గుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజు కొండాయికి, పగిడిద్దరాజు పూనుగొండ్ల బయల్దేరారు.

చివరి రోజు అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వనదేవతల ప్రవేశం సందర్భంగా కొద్దిసేపు గద్దెల వద్ద దర్శనాలను నిలిపివేశారు. ఆ తర్వాత గద్దెల వద్ద దర్శనాలను పునరుద్ధరించారు. 4 రోజుల పాటు వనదేవతల జాతర వైభవోపేతంగా సాగింది. ఈ సారి 1.30 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారుల అంచనా.