జాతీయ హోదాకై పోరాటం తప్పదు: ఎర్రబెల్లి, దాస్యం

జాతీయ హోదాకై పోరాటం తప్పదు: ఎర్రబెల్లి, దాస్యంవరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరను నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా మంత్రి ఎర్రబెల్లి దయాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తూ జాతర నిర్వహణను పరిశీలిస్తున్నారు.

ఇందులో భాగంగా మంత్రి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ లు వరంగల్ టైమ్స్ తో జాతర ఏర్పాట్లను తెలిపారు. అయితే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు జాతరలో వసతుల ఏర్పాట్లు అంతగా ఉండేవి కాదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతే మేడారం మహాజాతరలో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు సంపూర్ణంగా జరిగాయని అన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ రాష్ట్ర, కేంద్ర నేతలు ఉన్నప్పటికీ వనదేవతల జాతరకు జాతీయ హోదా కల్పించడంలో విఫలమయ్యారని, వివక్షత చూపిస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని, అదే క్రమంలో మేడారం జాతరకు జాతీయ హోదాను కల్పించడంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వమే క్రెడిట్ దక్కించుకుంటుందని వారు స్పష్టం చేశారు.