అస్సాం సీఎంపై కేసు నమోదు

అస్సాం సీఎంపై కేసు నమోదువరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2 రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ నేతలు 709 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు అస్సాం సీఎంపై ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించారనే ఆరోపణల కింద కేసులను చేర్చారు.

అస్సాం సీఎంపై కేసు నమోదు విషయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 709 పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఫిర్యాదులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అవుతాయి. ప్రతీ పోలీస్ స్టేషన్ లో జీడీ ఎంట్రీ చేసుకుని జూబ్లీహిల్స్ పీఎస్ కు బదిలీ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో ఉన్న కేసునే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.