వరంగల్ టైమ్స్, విశాఖ జిల్లా : ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేడు విశాఖ వస్తున్నారు. ఈ నెల 21న విశాఖ నౌకాదళ కేంద్రంలో నిర్వహించే రివ్యూకు కోవింద్ హాజరవుతారు. రాష్ట్రపతితో పాటు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం వైఎస్ జగన్, త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయుధ దళాల సుప్రీం కమాండర్ గా వ్యవహరించే రాష్ట్రపతి, తన పదవీకాలంలో ఒకసారి నౌకాదళం సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విశాఖ పట్టణంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సాయంత్రం 5.30 గంటలకు భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్టణం చేరుకుంటారు. ఆయనకు ఆహ్వానం పలికేందుకు ఏపీ సీఎం జగన్ సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి వస్తారు. ఐఎన్ఎస్ డేగా వద్ద రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం సాయంత్రం 5.55 ని.లకు సీఎం కడపకు వెళ్లిపోనున్నారు. రాష్ట్రపతి ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన బసకు వెళ్తారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూ ప్రారంభంకానుంది. ఈ రివ్యూలో ఇండియన్ కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, చెన్నైలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ప్లాట్ ఫాంలతో పాటు 60కి పైగా నౌకలు, జలాంతర్గాములు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటాయి.
సమీక్ష అనంతరం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు బహుళ- జాతి నౌకాదళ వ్యాయామం జరుగుతుందని, దీనికోసం భారతదేశం 45 దేశాలను ఆహ్వానించినట్లు ఇండియన్ నేవీ అధికారులు తెలిపారు. ఇలాంటి ఫ్లీ రివ్యూ చివరి సారిగా 2016లో జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం పొందిన 75 యేళ్లకు గుర్తుగా ఈ యేడాది భారత నావికాదళం అనే థీమ్ తో ఫ్లీట్ రివ్యూ చేపడుతున్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఇప్పటి వరకు 11 నౌకాదళం సమీక్షలు జరిగాయి.