కోచ్ ఫ్యాక్టరీ సాధించేది కాంగ్రెస్సే : జంగా రాఘవరెడ్డి

 కోచ్ ఫ్యాక్టరీ సాధించేది కాంగ్రెస్సే : జంగా రాఘవరెడ్డిహనుమకొండ జిల్లా : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అన్నారు. తెలంగాణ సాధించామని విర్రవీరుగుతున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నెరవేరని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన కానరావడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ఇచ్చిందీ కాంగ్రెస్సే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చేదీ కాంగ్రెస్ పార్టీయే అని జంగా రాఘవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనకై తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతి రావు ఫూలే 130వ వర్ధంతిని పురస్కరించుకుని కాజీపేట జంక్షన్ సర్కిల్ లో నవంబర్ 28 ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 29 సాయంత్రం 4 గంటల వరకు 30 గంటల మహా నిరాహార దీక్ష చేపట్టారు.

జనగామ డీసీసీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఈ మహా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీకి మద్దతు పలికారు. కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం రైల్వే ఉద్యోగుల కోసం కాదని, భావితరాల భవిష్యత్ కోసమని తెలిపారు. ఉద్యమంతో తెలంగాణ తెచ్చామని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులకు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలన్న ఆలోచన లేదా అని ప్రశ్నించారు.

కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకుపార్లమెంటు సభ్యులు తమసభ్యత్వాలకు రాజీనామా చేసి కోచ్ ఫ్యాక్టరీ సాధించాకే పార్లమెంట్లో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తదనంతరం జరిగే పరిణామాలకు అధికార పార్టీ నాయకులే కారణమని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి దుయ్యబట్టారు. ఈ మహా నిరాహార దీక్షలో రైల్వే కార్మికులు విద్యార్థులు నిరుద్యోగులు కుల సంఘాలు చిరు వ్యాపారులు సకల జనులు పాల్గొన్నారు.