వరంగల్ లో పట్టుబడ్డ ఆ ఇద్దరు ఎవరు..?

వరంగల్ లో పట్టుబడ్డ ఆ ఇద్దరు ఎవరు..?హనుమకొండ జిల్లా : ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన బుకీల నుంచి రూ.25 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముంబయి కేంద్రంగా ఆన్లైన్ ద్వారా క్రికెట్ , మూడు ముక్కల పేకాట బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసీ పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరి నుండి సుమారు రూ.2కోట్ల 5లక్షల 14వేల రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించి 43 పాస్ బుక్ లు, ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ డా.సీపీ తరుణ్ జోషి, అరెస్ట్ అయిన నిందితులిద్దరిని, వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అరెస్ట్ అయిన వారి వివరాలను సీపీ వెల్లడించారు.

అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరైన మాడిశెట్టి ప్రసాద్ గత కొన్నేండ్లుగా హైదరాబాద్ హఫీజ్ పేటలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని రెడీమేడ్ బట్టల వ్యాపారం నిర్వహించుకునేవాడు. సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న మాడిశెట్టి ప్రసాద్ కొద్ది మంది స్నేహితులతో కలిసి 2016లో క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించాడు. దీంతో ఆదాయం పెరగడంతో 2018లో స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కల పేకాట బెట్టింగ్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే నిందితుడు మాడిశెట్టి ప్రసాద్ కు మహారాష్ట్ర వాని ప్రాంతానికి చెందిన అభయ్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది.

ఈ పరిచయం ద్వారా నిందితుడు ప్రసాద్ కి ఆన్లైన్ బెట్టింగ్ పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగింది. అంతేకాకుండా అభయ్ నిర్వహించే ఆన్లైన్ బెట్టింగ్ వెబ్ సైడ్ ద్వారా ప్రసాద్ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించే బుకీగా నియమించబడ్డాడు. ఇలా ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ లు ఆడే యువతకు ఎర వేశారు. మొదగా తక్కువ మనీతో ఎక్కువ లాభం పొందేలా వ్యక్తులను ఆకర్షించిన నిందితులు ప్రసాద్, అభయ్ లు మరింత టెక్నాలజీని ఉపయోగించినట్లు సీపీ డా. తరుణ్ జోషి వెల్లడించారు.

దీనితో ఆన్లైన్ లో బెట్టింగ్ పాల్గొనేవారు ముందుగా అన్లైన్ ద్వారా గాని వ్యక్తిగతం డబ్బు చెల్లించిన వ్యక్తులకు అభయ్ నుండి నిందితుడికి వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్లను వాట్సప్ ద్వారా బెట్టింగ్ లో పాల్గొనే వ్యక్తులకు అందజేసేవాడు. నిందితుడు ప్రసాద్ అందజేసే డబ్బులో కమిషన్ మినహాయించి మిగతా డబ్బును అందజేసేవాడు. ఈ విధంగా రోజు వారిగా జరిగిన లావాదేవీల అనంతరం వచ్చిన లాభంలో నిందితుడు ప్రసాద్ వాటాలను అనసరించి బెట్టింగ్ వెబ్ సైట్ నిర్వహకుడు అభయ్ కు అందజేసేవాడు. నిందితుడు ప్రసాద్ ఈ డబ్బు లావాదేవీలను నిర్వహించేందుకుగాను బీనామీ పేర్లపై బ్యాంక్ ఖాతాలను నిర్వహించేవాడు.

ఈ క్రమంలోనే నిందితుడు మరో ఇద్దరు నిందితులతో కల్సి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా 2019లో హైదరాబాద్ కమిషనరేట్ కు చెందిన చందానగర్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు వరంగల్ సీపీ తెలిపారు. జైలు నుండి విడుదలైన అనంతరం నిందితుడు ప్రసాద్ హన్మకొండలోని తన అత్తగారింటికి మకాం మార్చాడు.

హన్మకొండ కేంద్రంగా చేసుకుని నిందితులు ఐపిఎల్, టి 20-20 వర్డల్ కప్ తో పాటు మూడు ముక్కల పేకాట ఆన్‌లైన్ బెట్టింగ్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. పైగా బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును బినామీ పేర్లపై వున్న బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో పాటు వివిధ స్థిరాస్తులను కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ లో మోసపోయిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులో నిందితులపై పోలీసులు నిఘా వేశారు. ఈక్రమంలోనే కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసును పోలీసులు నమోదు చేసుకుని సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా అధ్వర్యంలో కేయూసీ మరియు సైబర్ క్రైం పోలీసులు సంయుక్తంగా కల్సి దర్యాప్తు చేసి నిందితులను గుర్తించడం జరిగింది.

ఈ నిందితుల్లో ఒకడైన అభయ్ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకోనేందుకు సోమవారం ఉదయం మరో నిందితుడు ప్రసాద్ ఇంటికి వచ్చినట్లుగా కేయూసీ పోలీసులకు సమాచారం రావడంతో ఇన్స్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి తన సిబ్బందితో వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు బ్యాంక్ పాసుబుక్ లు, ఏటియం కార్డులు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి, ఇతర పోలీస్ అధికారులను సీపీ డా.తరుణ్ జోషి అభినందించారు.