ప్రధానితో ముగిసిన కేసీఆర్‌ భేటీ

ప్రధానితో ముగిసిన కేసీఆర్‌ భేటీ

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో.. హైదరాబాద్‌కు వరద సాయంతో పాటు జీఎస్టీ బకాయిలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారం అందించడం వంటి అంశాలూ ఈ భేటీలో కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఈ మధ్యాహ్నం కేంద్ర విమానయాన శాఖ మంత్రి హరిదీప్‌సింగ్ పురితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలని, ఆరు డొమిస్టిక్‌ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. బసంత్‌నగర్‌, మామునూరు, ఆదిలాబాద్‌, జక్రాన్‌పల్లి, దేవరకద్ర, కొత్తగూడెంలో విమానాశ్రయాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలను 2018లోనే పంపినట్టు సీఎం తెలిపారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా సర్వే కూడా చేసిందన్న కేసీఆర్‌.. విమానాశ్రయాల ఏర్పాటుకు సింగిల్‌ విండో పద్ధతిలో అనుమతులివ్వాలని కోరారు. సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటు అంశంపైనా చర్చించినట్టు సమాచారం. నిన్న కేంద్రమంత్రులు, అమిత్‌షా, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కేసీఆర్‌ సమావేశమశమైన విషయం తెలిసిందే..