నెక్ట్స్ టార్గెట్ వరంగలేనా..?

వరంగల్​ , ఖమ్మం మున్సిపాలిటీలపై కమలం కన్ను
వ్యూహ రచన చేస్తోన్న బీజేపీ
బలమైన నేతలపై గురి
మాలెక్కలు మాకున్నాయన్న టీఆర్​ఎస్​నెక్ట్స్ టార్గెట్ వరంగలేనా..?వరంగల్​: వరంగల్​పై కమలం కన్నుపడిందా.. గ్రేటర్​ హైదరాబాద్​ సీన్​ రిపీట్​ కానుందా..? అందుకు తగ్గట్టుగా వ్యూహరచన సాగుతుందా.. అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10 వతేదీన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి పర్యటించినట్లు చెబుతున్నారు. కిషన్​రెడ్డి అధికార పర్యటనలో భాగంగా వచ్చినప్పటికీ అది గ్రేటర్​ వరంగల్​ ఎన్నికలకను దృష్టిలో పెట్టుకునే వచ్చారని పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. 2‌‌023లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఇందుకు తగ్గట్టుగా వ్యూహరచన చేస్తోంది. వచ్చిన ప్రతి ఎన్నికను ఉపయోగించుకుని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అక్కడ వచ్చిన ఉప ఎన్నికను ఉపయోగించుకుని అధికార టీఆర్​ఎస్​ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి స్వల్ప ఓట్ల తేడాతో బీజేపీ విజయం సాధించింది. అయితే ఇక్కడ రఘునందన్​రావు మూడు సార్లు పోటీ చేసి ఓటమి చెందడంతోనే ప్రజలు సానుభూతితో గెలిపించారని ఇది బీజేపీ బలం కాదని టీఆర్​ఎస్​ పార్టీ తేలికగా తీసుకొంది. బీజేపీ గెలుపును మరిపించేలా భారీ విజయం సాధించాలనే ఎత్తుగడతో ప్రభుత్వం అతి కొద్ది సమయంలోనే గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికలకు నోటిఫికేషన్​ ఇచ్చింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటీఆర్​ఎస్​ అందుకు తగ్గట్టుగానే ప్రచారం నిర్వహించింది. బీజేపీ చేసిన విమర్శలను తిప్పికొట్టింది. నెక్ట్స్ టార్గెట్ వరంగలేనా..?అయితే గ్రేటర్ లో ఫలితం మాత్రం ఆశించినంత రాలేదు. ఇక్కడ బీజేపీ 4 స్థానాలనుంచి 48 స్థానాలకు తన బలాన్ని పెంచుకుంది. అటు దుబ్బాక ఇటు హైదరాబాద్​లో అనూహ్యంగా బలం పుంజుకున్న బీజేపీ ఇప్పుడు రానున్న గ్రేటర్​ వరంగల్​, ఖమ్మం మున్సిపల్​ ఎన్నికలపై దృష్టి సారించింది. వరంగల్​లో కార్పొరేటర్ల పనితీరు, వారి అక్రమాలను , ప్రభుత్వ వైఫల్యాలను ప్రచార ఆస్త్రాలుగా చేసుకుని ప్రచారం నిర్వహించాలని చూస్తోన్నట్లు సమాచారం. వరంగల్​ జిల్లాలో బీజేపీకి అంత బలం లేకపోయినా దుబ్బాక, హైదరాబాద్​ విజయాన్ని ఇక్కడ కూడా రిపీట్​ చేయాలని భావిస్తోంది. వరంగల్​లో బలమైన నేతలను ఆపరేషన్​ ఆకర్ష్​ పేరుతో ఆకర్షిస్తుంది. కాంగ్రెస్​లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకుని వారికి టికెట్లు ఇచ్చి గ్రేటర్​ వరంగల్​పై కమలం జెండా ఎగురవేయాలని బీజేపీ పార్టీ భావిస్తోంది. అయితే టీఆర్​ఎస్​ శ్రేణులు మాత్రం మా లెక్కలు మాకు ఉన్నాయి అని చెప్పుకుంటుంది. వరంగల్​ అంటేనే టీఆర్​ఎస్​కు గుండెకాయలాంటిదని అంటుంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు ఆదరిస్తారని గట్టి నమ్మకంతో ముందుకు పోతుంది. తప్పకుండా గ్రేటర్​ వరంగల్​లో టీఆర్​ఎస్​ విజయదుందుభి మోగిస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. మరి ప్రజలు గ్రేటర్ వరంగల్ లో ఏ పార్టీని ఆదరిస్తారో వేచి చూడాలి.