జనవరిలోపు పదవుల భర్తీ

పలు కమిషన్లలో ఖాళీలపై సీఎం కేసీఆర్‌ కసరత్తు..అర్హులైన వారి జాబితాల పరిశీలన..క్రియాశీలురు, అనుభవజ్ఞులకు ప్రాధాన్యమిచ్చే అవకాశం..భారీగా ఆశావహులుజనవరిలోపు పదవుల భర్తీహైదరాబాద్​ : తెలంగాణలో ఖాళీగా ఉన్న వివిధ కమిషన్లలోని పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్‌ వీటిపై కసరత్తు చేస్తున్నారు. జనవరి రెండో వారానికల్లా ముఖ్యమైన నియామకాలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత బీసీ, మహిళా కమిషన్‌ల ఛైర్‌పర్సన్లు, సభ్యుల పదవులన్నీ ఖాళీగా ఉన్నాయి. సమాచార హక్కు చట్టంలో ప్రధాన కమిషనర్‌, మరికొన్ని కమిషనర్ల పోస్టులు భర్తీ కావాలి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌లోని ఛైర్మన్‌, ముగ్గురు సభ్యులు ఈ నెల 18న పదవీ విరమణ చేస్తున్నారు. ఈ కమిషన్లు చట్టబద్ధమైనవి. త్వరితగతిన భర్తీ చేయాల్సి ఉంది. మహిళా కమిషన్‌ను సత్వరమే నియమించాలని ఇటీవల హైకోర్టు సూచించింది. తెరాసతో అనుబంధం, క్రియాశీలకంగా పనిచేయడం ఇతర సానుకూలతలు ఉన్న అనుభవజ్ఞులైన నేతలు, నిపుణులు, వివాదరహితులైన విశ్రాంత ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, అధికారులు తదితరుల పేర్లతో కూడిన జాబితాను కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు.

అనుకూలతలుంటేనే…

సామాజిక సమీకరణాలు, పార్టీకి విధేయతలు, చురుకైన పనితీరు గల వారి వివరాలు ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు. ఉద్యోగ నియామకాలు, శాఖాపరమైన పరీక్షలు నిర్వహించే రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ కీలకమైనది. ఈ పాలకవర్గాన్ని సీఎం ముందుగా ఖరారు చేసే వీలుంది. ప్రస్తుత ఛైర్మన్‌ను కొనసాగించడానికి వీల్లేదు. సభ్యులుగా రెండోసారి నియామకం కుదరదు. సభ్యులుగా పనిచేసిన వారు ఛైర్మన్‌ పదవికి అర్హులు కాగా… ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్న సభ్యుడు విఠల్‌ ఛైర్మన్‌ పదవికి పోటీ పడుతున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘం నేతగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడం, బీసీ కావడం, టీఎస్‌పీఎస్సీ సభ్యునిగా ఆరేళ్ల అనుభవం ఆయనకు అనుకూలంగా ఉంది. ఇతరుల పేర్లు ఏమైనా పరిగణనలోకి తీసుకుంటే వారి ఎంపిక జరిగే వీలుంది. మహిళా కమిషన్‌ నియామకం అనివార్యంగా మారడంతో సీఎం దీనికి అర్హులైన వారి పేర్లను పరిశీలిస్తున్నారు. చట్టబద్ధ కమిషన్లలో గతంలో పనిచేసిన అనుభవంతో పాటు రాజకీయంగా రాణించిన వారి సమాచారాన్ని ఆయన తీసుకున్నారు. బీసీ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులుగా … ఇతర వ్యాపకాలు లేకుండా పూర్తికాలం సమయాన్ని కేటాయించే వారికి అవకాశం ఇవ్వాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. పలువురు నేతలు పదవులను ఆశిస్తుండగా వారి పనితీరును విశ్లేషించడంతో పాటు భవిష్యత్తులో భర్తీ చేయబోయే రాజకీయ పదవులను దృష్టిలో పెట్టుకొని వీటిని భర్తీ చేయనున్నారు. సమాచార హక్కు చట్టం కమిషన్‌లో ఖాళీగా ఉన్న ప్రధాన కమిషనర్‌ పదవిని విశ్రాంత న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు, పదవీ విరమణ పొందిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, కొందరు తెరాస సీనియర్‌ నేతలు ఆశిస్తున్నారు.

తగిన జాగ్రత్తలతో. .

తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటి కమిషన్ల నియామకాలు జరగగా మున్ముందు జరగబోయేవి రెండో దఫా నియామకాలు. మొదటి దఫా కమిషన్ల పనితీరును బేరీజు వేసి, సీఎం కొత్త కమిషన్ల పాలకమండళ్ల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిసింది. గతంలో పనిచేసిన వారి లోపాలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు.

ప్రయత్నాలు షురూ…

రాష్ట్రంలో వివిధ కమిషన్లలోని పదవుల కోసం భారీగా ఆశావహులున్నారు. వీటిని పొందేందుకు తెరాస నేతలతో పాటు ఇతరులు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ద్వారా అవకాశం పొందాలని భావిస్తున్నారు. పార్టీ అధిష్ఠానాన్ని కలిసి తమ ఆసక్తి తెలియజేశారు. గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పదవులకు పోటీ పడినవారు, వివిధ ఎన్నికల్లో పదవులను ఆశించకుండా పనిచేసిన వారు తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.