కార్మికులకు సీఎం కేసీఆర్ మే డే విషెష్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కార్మిక, కర్షకలోకానికి మే డే శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. ఉత్పత్తి, సేవారంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటూ విజయవంతంగా అమలవుతున్నదని వెల్లడించారు.వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టి జరుగుతున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అది దేశాభివృద్ధికి దోహదపడుతున్నదని పేర్కొన్నారు. నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.