టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణలో టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2023 ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులతో మంత్రి పరీక్షల సన్నద్ధతపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ యేడాది నుంచి 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదే టైంలో వందశాతం సిలబస్ తో పరీక్షలు జరుపుతామన్నారు. వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ ఉండదని మంత్రి చెప్పారు.నమూనా ప్రశ్నాపత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా పాఠాలు చెప్పాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఉత్తీర్ణతా శాతం సాధించేలా చర్చలు చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.