దలైలామాను బుద్ధవనానికి ఆహ్వానించిన మల్లెపల్లి

దలైలామాను బుద్ధవనానికి ఆహ్వానించిన మల్లెపల్లి

దలైలామాను బుద్ధవనానికి ఆహ్వానించిన మల్లెపల్లివరంగల్ టైమ్స్, నాగార్జునసాగర్ (నందికొండ) : తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ విజయపురి వద్ద కృష్ణానది తీరంలో 274 ఎకరాల విస్తారమైన ప్రదేశంలో నెలకొల్పిన బుద్ధవనాన్ని సందర్శించడానికి బౌద్ధ మత గురువు ఆచార్య దలైలామా ఆసక్తిని ప్రదర్శించారని ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ధర్మశాలలో పరమ పూజ్య దలైలామాను కలుసుకొని బుద్ధ వనాన్ని తప్పకుండా సందర్శించవలసిందిగా మల్లేపల్లి లక్ష్మయ్య ప్రత్యేకంగా ఆహ్వానించారు. 2006లో కాలచక్ర మహా సమ్మేళన యాత్రలో భాగంగా దలైలామా బుద్ధ వనంలో నాటిన రావి మొక్క వృక్షంగా మారిందని ఈ సందర్భంగా దలైలామాకు మల్లెపల్లి లక్ష్మయ్య గుర్తు చేశారు. వాటి ఛాయా చిత్రాలను దలైలామాకు ప్రత్యేకంగా అందించారు. బుద్ధవనం జ్ఞాపికను అందజేశారు.

బుద్ధవనం ప్రత్యేకతలు, నిర్మాణ శైలి, అపూర్వమైన శిల్ప సంపద గురించి దలైలామాకు వివరించారు. కన్సల్టెంట్ విషయ నిపుణులు ఈమని శివనాగిరెడ్డి ఈ సందర్భంగా ఆయన రాసిన బుద్ధిస్టు ఆర్కియాలజీ ఇన్ తెలంగాణ చారిత్రక పుస్తకాన్ని దలైలామాకు బహూకరించారు. ప్రత్యేక అధికారితో పాటు ఓఎస్డి కే.సుధాన్ రెడ్డి, సలహాదారు ఆచార్య సంతోష్ రౌత్, బౌద్ధ అభిమానులు కేకే రాజా, రామకృష్ణారాజులు తదితరులు పాల్గొన్నారని మల్లేపల్లి లక్ష్మయ్య మీడియాకు తెలిపారు.