జానా వారి చూపు మిర్యాలగూడ వైపు! 

జానా వారి చూపు మిర్యాలగూడ వైపు! జానా వారి చూపు మిర్యాలగూడ వైపు! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : నాగార్జున సాగర్ నుంచి వరుసగా రెండోసారి కూడా ఓటమి ఎదురు కావడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఢీలా పడిపోయారు. ఇక ఆయన సాగర్ నుంచి మరోసారి పోటీచేసేందుకు ఉత్సాహంగా లేరన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సాగర్ లో మారిన రాజకీయ పరిస్థితులతో ఆయన మిర్యాలగూడ వైపు చూస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

*ఆయనపై వ్యతిరేకతే జానాకు కలిసొచ్చేనా !
మిర్యాలగూడలో సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు గులాబీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఒకప్పుడు జానారెడ్డికి సన్నిహితుడు. కాంగ్రెస్ నుంచి గెలిచి గులాబీ పార్టీలోకి జంప్ కొట్టారు. 2018లో మరోసారి మిర్యాలగూడ నుంచి విజయం సాధించారు. అయితే ఈసారి ఆయనపై వ్యతిరేకత పెరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన మాటతీరే ఆయన కొంప ముంచబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి వెంటనే అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే ఓ సర్వే కూడా చేయించినట్లు టాక్. అందులో జానారెడ్డికి ఆశించిన దాని కంటే మంచి ఫలితాలు వచ్చినట్లు సమాచారం. దాంతో మిర్యాలగూడ నుంచి పోటీ చేసేందుకు జానారెడ్డి ఉత్సాహంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతానికి మిర్యాలగూడలో రాజకీయం భాస్కర్ రావుకు అంత కలిసొచ్చేలా కనిపించడం లేదు. ఇటీవల దామరచర్ల మండలంలోని నర్సాపూర్ లో పర్యటించిన ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష కార్యకర్తలెవ్వరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకోవద్దని, కేసీఆర్ ప్రభుత్వం వేసిన రోడ్లపై నడవద్దని మాట్లాడారు. దీంతో ఈ మాటలు విన్న అక్కడి జనం నివ్వెరపోయారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడంతో భాస్కర్ రావుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జానా వారి చూపు మిర్యాలగూడ వైపు! *పక్కా ప్లానింగ్ లో జానా రెడ్డి !
మిర్యాలగూడలో మొదటి నుంచి కాంగ్రెస్ కు కొంత అనుకూల వాతావరణం ఉంది. దీనికి తోడు ఈసారి భాస్కర్ రావుపై వ్యతిరేకత ఉందన్న వాదన ఉంది. ఇవన్నీ క్యాష్ చేసుకునేందుకు జానారెడ్డి సిధ్ధమవుతున్నట్లు టాక్. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి సరైన ప్లానింగ్ వేసుకునే పనిలో జానారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

జానారెడ్డి గురించి మరో వాదన కూడా వినిపిస్తోంది. జానారెడ్డి సాగర్ నుంచి, ఆయన కుమారుడు మిర్యాలగూడ నుంచి పోటీచేసే అవకాశాలు కూడా ఉన్నాయట. సాగర్ బీఆర్ఎస్ లో ఇటీవల జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలతో ఎమ్మెల్యే నోముల భగత్ కు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో జానారెడ్డి సాగర్ నుంచి పోటీ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు టాక్. ఇలా సాగర్, మిర్యాలగూడ రెండు సీట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడేలా పక్కా స్కెచ్ వేస్తున్నారట జానావారు.

జానారెడ్డి పోటీపై పలు రకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ఆయన వైపు నుంచి ఎలాంటి సిగ్నల్స్ అయితే కనిపించడం లేదు. మరి ఆయన మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తారా? లేక సాగర్ నుంచి బరిలో ఉంటారా? లేక అసలు పోటీ చేయకుండానే తన కుమారుడిని రంగంలోకి దింపుతారా? అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.