భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

వరంగల్ టైమ్స్, మహబూబాబాద్: జిల్లాలోని తాళ్ఊకల్లు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మరిపెడ మండలం తాళ్ళఊకల్లు గ్రామానికి చెందిన కళ్ళం నవీన్ కి గత 8 నెలల క్రితం మానస అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భార్య, భర్తల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే భార్య మానస పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రమ్మని అడిగితే రావడం లేదని భర్త నవీన్ మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భార్య మానస నిత్యం వేధింపులకు పాల్పడేదని స్థానికులు చెబుతున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.