ఫలించని చర్చలు..14న దేశవ్యాప్త ఆందోళన

ఫలించని చర్చలు..14న దేశవ్యాప్త ఆందోళనఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు ఆందోళనలు చేపడుతున్న విషయం విదితమే. అయితే కేంద్రం వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 08న రైతులు, కార్మిక సంఘాలు భారత్ బంద్ ప్రకటించి విజయవంతం చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో డిసెంబర్ 9న మరోసారి చర్చకు సిద్ధమైనప్పటికీ ఒక రోజు ముందుగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డిసెంబర్ 8న రాత్రి రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ వారి చర్చలు సఫలం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు తాము ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు స్పష్టం చేశాయి. చట్టాలను రద్దు చేసే యోచన లేదని, సవరణలకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను కేంద్రం పంపిన నేపథ్యంలో రైతు సంఘాలు తమ వైఖరిని తెలిపాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పునరుద్ఘాటించాయి.ఈ నేపథ్యంలో ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు రైతు సంఘాల నేతలు బుధవారం మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 12న ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారులను దిగ్భందిస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఆందోళన చేసి, బీజేపీ నాయకులను ఘెరావ్ చేస్తామని, డిసెంబర్ 14న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల రైతులు ఈ ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.