తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్

తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్

వరంగల్ టైమ్స్, ఖమ్మం జిల్లా : రాష్ట్రంలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ గా ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ సలీమా నిలిచారు. డిసెంబర్ 21న విడుదలైన నాన్ క్యాడర్ ఐపీఎస్ జాబితాలో సలీమా చోటు దక్కించుకున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన లాల్ బహదూర్, యాకూబ్ బీ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు కూతుళ్లు, ఒక్క కుమారుడు కాగా మొదటి సంతానం సలీమా. లాల్ బహదూర్ ఖమ్మంలో ఎస్సైగా పనిచేసి రిటైర్ అయ్యారు.తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ఇక సలీమా కుటుంబసభ్యులందరూ ఉద్యోగులే. సలీమా ఇద్దరు చెల్లెళ్లలో ఒక సోదరి జరీనా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఇటీవలే ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ కు ఎంపికయ్యారు. మరో సోదరి మున్నీ ఖైరతాబాద్ ఎంవీఐగా పనిచేస్తున్నారు. తమ్ముడు ఖాసీం హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్ గా స్థిరపడ్డారు. సలీమా భర్త కూడా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు.

సలీమా విద్యాభ్యాసమంతా ఖమ్మంలోనే సాగింది. ఖమ్మంలో డిగ్రీ పూర్తి చేసి, వరంగల్ కేయూలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో పీజీ పూర్తిచేశారు. గ్రూప్ ఉద్యోగాలకు ప్రిపేరై 2007లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో డీఎస్పీగా తొలి పోస్టింగ్ పొందారు. ఆ తర్వాత అంబర్ పేట పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ గా, మాదాపూర్ లో అడిషనల్ కమిషనర్ గా పనిచేశారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ లో డీసీపీగా ఉన్నారు. సలీమా ఐపీఎస్ కు ఎంపికవ్వడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.