కార్మెల్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు

కార్మెల్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలుహనుమకొండ జిల్లా : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే రాష్ట్రంలో సర్వ మతాల పండుగలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అన్ని మతాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ, ముఖ్యమైన పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన కొనియాడారు.

డిసెంబర్ 25 క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ప్రీ క్రిస్మస్ వేడుకలను హనుమకొండలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. కాజీపేట మండలంలోని కార్మెల్ బాప్టిస్ట్ చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న క్రిస్మస్ బట్టల పంపిణీ కార్యక్రమానికి మరియు ప్రీ క్రిస్మస్ వేడుకలకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలను చీఫ్ విప్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఇక క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు వెయ్యి గిఫ్ట్ ప్యాక్ లను, 2 లక్షల ఫీస్ట్ ని అందించడం జరిగిందని చీఫ్ విప్ తెలిపారు. క్రిస్టియన్ సమాజంలోని సుమారు రెండున్నర లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల 50లక్షల వ్యయంతో నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్నట్లు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.

కార్మెల్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు, 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, కాజీపేట ఎమ్మార్వో కిరణ్, మైనార్టీ డీఈ శ్రీనివాస్, చర్చి ఫాస్టర్లు, కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.