బీజేపీ నేతలను గట్టిగా నిలదీయండి: హరీష్ రావు

బీజేపీ నేతలను గట్టిగా నిలదీయండి: హరీష్ రావు

వరంగల్ టైమ్స్, మంచిర్యాల జిల్లా : కొత్త జిల్లా ఏర్పాటు చేసుకోవడం, మెడికల్ కాలేజి ఏర్పాటు చేసుకోవడం ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రావడంతో, వచ్చిన తెలంగాణకు కేసీఆర్ సీఎం గా ఉండటంతో ఆ కల నెరవేరిందని గుర్తు చేశారు. మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో రూ. 40 కోట్లతో నిర్మించబోతున్న నర్సింగ్ కాలేజీకి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ.1.25 కోట్లతో పాథాలజీ, రేడియాలజీ సేవలతో కొత్త డయాగ్నొస్టిక్ సెంటర్ కోసం శంకుస్థాపన చేయడంతో పాటు, రూ. 17 కోట్లతో ఏరియా ఆస్పత్రిలో 100 పడకల ఎంసిహెచ్, రూ. 23 లక్షలతో పీడియాట్రిక్ యూనిట్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.బీజేపీ నేతలను గట్టిగా నిలదీయండి: హరీష్ రావుమంచిర్యాలకు రూ.500 కోట్ల మెడికల్ కాలేజీ ఇచ్చారు. రూ. 50 కోట్ల నర్సింగ్ కాలేజీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఏపీలో ఉన్నపుడు తెలంగాణలో 3 కాలేజీలు ఉండేవని, కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత 17 మెడికల్ కాలేజీలకి పెంచుకున్నామంటే అది కేసీఆర్ ఘనతేనని ఆయన అన్నారు. తెలంగాణ రాకుంటే , కేసీఆర్ లేకుంటే మంచిర్యాల జిల్లా అయ్యేదా, మెడికల్ కాలేజీ వచ్చేదా అని హరీష్ రావు ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణ ఏర్ప‌డే నాటికి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 700 మాత్ర‌మే ఉండేవి. ఇప్పుడు వాటిని 2,850 కి పెంచుకున్నాం. ఆశాలు, ఎ ఎన్ ఎం ల జీతాలు దేశంలో ఎక్కడ లేని విధంగా పెంచుకున్నాము. మనం ప్రజల కోసం ఇంకా కష్టపడాలి. సాధారణ డెలివరీలు పెరగాలి అని సూచించారు.

నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అనే రోజులు పోయి , నేను సర్కారు దవాఖానాకే పోతాం అనే రోజులు వచ్చాయి అంటే కేసీఆర్ పాలనాతీరు గొప్పతనమన్నారు. సింగరేణి మనకు ఆక్సిజన్ లాంటిది. కేంద్రం అన్ని సంస్థలను అమ్ముతున్నది. బడా కార్పొరేట్లకు బొగ్గు బాయిలు ఇస్తారట. ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతున్నది. ఈ విషయాల్లో బీజేపీ నేతలను గట్టిగా నిలదీయండని ఈ సందర్భంగా హరీష్ రావు ప్రజలను కోరారు. నాలుగు బొగ్గు బావుల వేలాన్ని వెంటనే నిలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎంపి వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దివాకర్ రావు, టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.