ఐకే రెడ్డిని టార్గెట్ చేసిన బీజేపీ!! 

ఐకే రెడ్డిని టార్గెట్ చేసిన బీజేపీ!!

ఐకే రెడ్డిని టార్గెట్ చేసిన బీజేపీ!! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆ మాటకొస్తే మొత్తం ఉత్తర తెలంగాణ నుంచి బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే 2014లో బీఎస్పీ నుంచి గెలిచినా, సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ లోకి తీసుకుని మరీ కేబినెట్ పోస్టు ఇచ్చారు. 2018లో మరోసారి గెలవడంతో మరోసారి కేబినెట్ లో కొనసాగించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నాలుగు ముక్కలైనా ఇంద్రకరణ్ రెడ్డి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు.

*కమలం వికసించాలంటే ఐకేకు బ్రేకులు వేయాల్సిందేనా !
2019 ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరపున సోయం బాపురావు అనూహ్య విజయం సాధించి సత్తా చాటారు. ఆ ఎఫెక్ట్ తో ఇక్కడ బీజేపీ బలపడింది. ముఖ్యంగా ఆదివాసీలు, యూత్ బీజేపీకి బాగా కనెక్ట్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది. అయితే బీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే ఇంద్రకరణ్ రెడ్డిని నిలువరించడం బీజేపీకి సమస్యగా మారింది. జిల్లా బీఆర్ఎస్ లో పెద్ద దిక్కుగా ఐకే రెడ్డికి బ్రేకులు వేయకపోతే కమలం పార్టీ సత్తా చాటడం కష్టమే.

ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ఖానాపూర్, ముధోల్, ఆసిఫాబాద్ లాంటి స్థానాల్లో బీజేపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు ఉంది. ఈ తరుణంలో దాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ కొత్త స్ట్రాటజీ వేయడం పక్కనబెట్టి, ముందు ఐకే రెడ్డి స్ట్రాటజీకి బ్రేకులు వేయాలి. లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా స్థానాల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఐకే రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో ఆయనదే కీరోల్. ఐకే రెడ్డి తనతో పాటు మరో ఇద్దరు, ముగ్గురిని ఆయన గెలిపించుకోగలరన్న వాదన ఉంది. అందుకే ఐకే రెడ్డిని నిలువరించేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తోందని సమాచారం.

*ఓటు బ్యాంక్ ఫలించేనా..
ఐకే రెడ్డి సొంత నియోజకవర్గం నిర్మల్. అక్కడ బీజేపీకి గట్టి ఓటు బ్యాంకు ఉన్నా సమర్థుడైనా నాయకుడైతే లేడు. కాంగ్రెస్ నుంచి మహేశ్వర్ రెడ్డి పోటీలో ఉండే అవకాశముంది. ఈ తరుణంలో సీనియర్ నేతలను తీసుకువచ్చే పనిలో ఉన్నారు బీజేపీ పెద్దలు. కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. దానికి ఆయన ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన కోసం మరికొంతకాలం వెయిట్ చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఒకవేళ అప్పటికీ మహేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించకపోతే మరో సీనియర్ నాయకుడు వేణుగోపాలచారిని తీసుకురావాలని అనుకుంటున్నారట.

ఇలా మహేశ్వర్ రెడ్డి లేకపోతే వేణుగోపాలచారి. ఇద్దరిలో ఎవరో ఒకరి ద్వారా సొంత అసెంబ్లీ స్థానం నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డిని నిలువరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంటే ఐకే రెడ్డి తన గెలుపుపైనే ఫోకస్ చేసి, ఉమ్మడి జిల్లా మొత్తాన్ని పట్టించుకోకుండా చేయాలన్న స్ట్రాటజీని అమలు చేయాలని కమలం పార్టీ భావిస్తోందని టాక్. మరి నిజంగానే ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.