సీనియర్లకు కోమటిరెడ్డి షాక్!!

సీనియర్లకు కోమటిరెడ్డి షాక్!!

సీనియర్లకు కోమటిరెడ్డి షాక్!!

వరంగల్ టైమ్స్ , టాప్ స్టోరి : కాంగ్రెస్ లో రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరు. అక్కడ జరిగినంత ఇంటర్నల్ వార్ ఎక్కడా జరగదు. ఏ నాయకుడు ఎప్పుడు సొంతపార్టీలోని ఏ నేతను టార్గెట్ చేస్తాడో తెలియదు. ఎవరిని ప్రశంసిస్తాడో అస్సలు అంచనా వేయలేం. ఇదే మరోసారి రుజువైంది. కొన్నిరోజులుగా కాంగ్రెస్ తో దూరందూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలక వీడారు. ఏకంగా గాంధీ భవన్ కు వచ్చారు. కొత్త ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేను కలిసి అన్ని విషయాలపై ఆయనతో కూలంకషంగా మాట్లాడారు. ఆ తర్వాత అస్సలు ముచ్చట జరిగింది. ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

*వారిద్దరి ములాఖత్ వెనుక ఉన్నది ఆయనేనా !
మునుగోడు ఉప ఎన్నికలకు ముందు నుంచి రేవంత్ రెడ్డి అంటేనే అంతెత్తున లేస్తున్న కోమటిరెడ్డి తాజాగా గాంధీ భవన్ కు వచ్చారు. రేవంత్ రెడ్డితో స్నేహగీతం పాడారు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కాసేపు ముచ్చటించుకున్నారు. జిగ్రీ దోస్తుల్లా ఇద్దరూ మాట్లాడుకున్నారు. గతంలో ఏమీ జరగనట్లు క్లోజ్ ఫ్రెండ్స్ లా ఇద్దరూ ఫోటోలకు పోజులిచ్చారు.

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ములాఖత్ కావడం వెనక తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని ఇద్దరికీ ఠాక్రే నచ్చజెప్పినట్లు సమాచారం. అసలే కొత్త ఇంఛార్జ్. లొల్లి ఎందుకు అనుకున్నారో ఏమో ఇద్దరూ వెనక్కు తగ్గారు. ఆయన చెప్పినట్లే ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. అంతేకాదు ఇక ముందు ఇద్దరూ కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు టాక్. గతం గతం ఇక ముందు ఎలాంటి పంచాయితీ లేకుండా ముందుకు సాగాలని రేవంత్, కోమటిరెడ్డి డిసైడ్ అయ్యినట్లు సమాచారం.

*ఫలించని మాణిక్ రావు మంత్రం !
కొత్త ఇంఛార్జ్ మాణిక్ రావు నియామకం తర్వాత కూడా సీనియర్లు మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డితో ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. ఇక కోమటిరెడ్డి అయితే రేవంత్ తో భేటీ అయ్యే అవకాశాలే లేవని పార్టీ శ్రేణులు అంచనా వేశారు. కోమటిరెడ్డి కూడా సీనియర్ల వైపే ఉన్నారని క్యాడర్ అంతా అనుకున్నారు. కానీ సీనియర్లకు షాకిస్తూ ఇప్పుడు రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భాయి భాయి అనడం తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.

*వారిద్దరి భేటీతో షాకైన సీనియర్లు
రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ కావడంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి ఆడియో బయటకు వచ్చినా, ఆయన ప్రచారానికి రాకపోయినా, షోకాజ్ నోటీసులు వచ్చిన సమయంలోనూ సీనియర్లు ఎవరూ కోమటిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాంటిది వారికి ఎవరికీ చెప్పకుండా రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ కావడంపై సీనియర్లు తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. రేవంత్ – కోమటిరెడ్డి భేటీతో సీనియర్లంతా షాక్ అయినట్లు తెలుస్తోంది.

*రేవంత్ దిగి వచ్చేనా !
ఠాక్రేను అందరూ కలిసి రేవంత్ పై మరోసారి కంప్లయింట్ చేసేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నారట. సీనియర్ల విషయంలో రేవంత్ దిగి వచ్చేలా చేసిన తర్వాతే పార్టీలో ముందుకెళ్లాలని వారంతా గట్టి పట్టుదలతో ఉన్నారట. కోమటిరెడ్డి కూడా తమ వెంటే ఉంటారని వారంతా భావించినట్లు సమాచారం. కానీ ఈలోపే కోమటిరెడ్డి సడెన్ ఎంట్రీ ఇచ్చి, రేవంత్ భేటీ కావడం సీనియర్లను ఆశ్చర్యపరిచిందని టాక్. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి లాంటి వారు కోమటిరెడ్డి తీరుపై చాలా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఠాక్రే పర్యటన నేపథ్యంలో ఇంకా ఎలాంటి ఆసక్తికర పరిణామాలు జరుగుతాయో చూడాలి !!